సినిమా ప్రేమికులకు ఇది శుభవార్తే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మూత పడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోబోతున్నాయి. జులై 23 నుంచి సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు కూడా సన్నాహాలు చేస్తున్నారు. తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించేస్తున్నారు. 23 నుంచి కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నెల నాలుగో వారం నుంచి మాత్రం పెద్ద సినిమాల విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి నాలుగు వారాలు దాటినట్టే.
ఆంధ్రాలో కూడా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఓ పక్క కరోనా థర్డ్ వేవ్ భయం ఉన్నా అలాంటి ముప్పు ఉండక పోవచ్చన్న ధైర్యం జనాల్లో ఉంది. జనం కూడా స్వేచ్ఛగా షాపింగ్ కాంప్లెక్స్ లకు, షాపింగ్ కు వెళుతున్నారు. థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వపరమైన అనుమతి కూడా ఉంది. ఏపీలో కూడా కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. గత ఏడాది లాక్ డౌన్ తర్వాత నిర్మాతలు, ఎగ్జిబిటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఈసారి కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు.
థియేటర్ వ్యవస్థ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి, ప్రభుత్వాల నుంచి ఎగ్జిబిటర్లు సాయం కోరుతున్నారు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించడానికి సుముఖత వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఇటీవల సమావేశమై కొత్త సినిమాలను ఓటీటీకి ఇవ్వవద్దన్న డిమాండును కూడా తెర మీదికి తెచ్చారు. కరెంటు బిల్లుల రద్దు, టిక్కెట్ రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లు చేశారు. ఈనెల 23 లోపు వీటిపై స్పష్టత వచ్చేస్తుంది.
కరెంటు బిల్లుల్ల రద్దు, టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేశాకే సినిమాల విడుదలపై స్పష్టత వస్తుంది. 23వ తేదీ శుక్రవారం నుంచి థియేటర్ల ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులూ ఉండకపోవచ్చనే భావిస్తున్నారు. నరసింహపురం అనే సినిమాని 23న విడుదల చేయబోతున్నారు. 90 ఎంఎల్ మూవీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి యర్రా రూపొందించిన ‘హౌస్ అరెస్ట్ చిత్రాన్ని కూడా ఈ నెల 23నే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏయే సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయన్నది మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది.
Must Read ;- అక్టోబరు వరకూ ఓటీటీకీ నో: తెలంగాణ ఫిలిం ఛాంబర్











