CBI Arrested Kadapa Rajasekhar Reddy :
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ సోషల్ మీడియా, దానికి వత్తాసు పలుకుతున్న పలువురు వ్యక్తులు తమదైన శైలిలో రెచ్చిపోతున్న వైనం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే ఎవరికైనా, ఏ విషయంలో అయినా ఓ పరిమితి అంటూ ఉంటుంది కదా. ఆ పరిమితి దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అలాంటి పరిస్థితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ తో పాటు దానికి వత్తాసు పలుకుతున్న నెటిజన్లకు ఎదురైందని చెప్పాలి. జగన్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై హైకోర్టు సంచలన తీర్పులు వెలువరించింది. అయితే హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై పలువురు వ్యక్తులు దూషణలకు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ అంశం తన దృష్టికి రాగా.. హైకోర్టు ఘాటుగానే స్పందించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేయగా.. సీఐడీ జరిపిన దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ఆ దర్యాప్తును ఏకంగా సీబీఐకి అప్పగించింది.
జాబితా రెడీ అయిపోయింది
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఈ కేసు దర్యాప్తును శరవేగంగా ముందుకు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జడ్జీలపై దూషణలు జరిగిన మాట వాస్తవమేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా ఎవరెవరు జడ్జీలపై దూషణలు చేశారన్న అంశంపైనా ఇప్పటికే ఓ సమగ్ర అవగాహనకు వచ్చింది. జడ్జీలపై దూషణలు చేసిన వ్యక్తుల జాబితాను కూడా సేకరించినట్లు సమాచారం. ఇంకేముంది.. జడ్జీలపై దూషణలు నిజమేనని తేలడం, ఆ దూషణలు చేసిన వ్యక్తుల జాబితా కూడా సిద్ధం కావడంతో.. ఆ జాబితా చేతిలో పట్టుకుని సీబీఐ బృందం నేరుగా బరిలోకి దిగింది.
సీఎం సొంత జిల్లాలోనే తొలి అరెస్ట్
ఈ క్రమంలో శనివారం నాడు సీబీఐ ఓ కీలక చర్యకు దిగింది. జడ్జీలపై దూషణలకు దిగినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన రాజశేఖరరెడ్డిని ఈ కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి విశాఖకు తరలించారు. విచారణలో భాగంగా రాజశేఖరరెడ్డిపై పలు కోణాల్లో ప్రశ్నలు సంధించనున్న సీబీఐ.. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలను రాబట్టే అవకాశాలున్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ లు మొదలైపోవడంతో వైసీపీ సోషల్ మీడియాలో భయాందోళనలు నెలకొన్నాయన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ ‘డిప్యూటీ’లంతా డమ్మీలే!