ఈ ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ లేదా?
పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు తలపెట్టిన ‘‘చలో విజయవాడ’’ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ.. విద్యార్థి సంఘాలు కూడా నిరుద్యోగ యువత కోసం ఉద్యమించనున్నాయి. జగన్ రెడ్డి పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి ఒక్క సచివాలయం పోస్ట్ లు తప్ప, ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. 32 నెలలు కావస్తున్నా.. నేటికి నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న పాపానపోలేదు! అందుకే ఈ నెల 10 న నిరుద్యోగ యువత తమ సమస్యల పరిష్కారం కోరుతూ.. ఉపాధ్యా, పోలీసు, గ్రూప్ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు! ప్రతి ఏడాది జనవరి నెలలో జగన్ రెడ్డి ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీస్తున్నారు. రెండు సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా, నేటికి ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి నోటిషికేషన్లు తక్షణమే జారీ చేయాలని ఏఐఎన్ఎఫ్, ఏఐవైఎఫ్, తెలుగునాడు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హామీకి కట్టుబడకుంటే ఊరుకునేది లేదు ..
జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను అధికారంలోకి రాగానే ఆ పోస్టులను భర్తీ చేస్తానన్న హామీ నేడు ఏమైందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా.. ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుపడకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు జేఏసీ నేతలు ఉద్యమిస్తాయని హెచ్చరిస్తున్నారు. డిఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ -1, 2 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎన్ఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మునినాయుడు డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులను విభజించి, పాలించు సూత్రంతో ఉద్యమాన్ని విచ్ఛన్నం చేయగలిగారేకానీ, నిరుద్యోగ సమస్యలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read:-సీఎం జాబ్ క్యాలండర్ కన్నా మార్కెట్‌లో దొరికేవి బెటర్ : అచ్చెన్నాయుడు