అసలు ఏపీలో ఏం జరుగుతుంది? అధికార పార్టీ నాయకులకు చీమకుట్టినా ప్రతిపక్షమే కారణం అనేలా తయారైంది ప్రభుత్వం. పేర్ని నాని హత్యాయత్నం కేసు చూస్తే అలానే అనిపిస్తుంది. ఎవరో తాపీ మేస్త్రీ మంత్రిపై దాడి చేయడం ఏంటి… దానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారణమంటూ విచారణ కోసం పోలీసులు ఏకంగా అతని ఇంటికి వచ్చి హంగామా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ విషయంపై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు.
అసలేం జరుగుతుంది?
ఎవరో ప్రభుత్వ విధానాలు నచ్చక మంత్రిపై దాడికి ప్రయత్నిస్తే దానికి కొల్లు రవీంద్ర కారణం అనడాన్ని అసలు ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంత్రి దాడి కేసులో రాజకీయ కోణం లేదని మీడియా ముందు ప్రభుత్వమే చెప్పింది. కానీ, ఇప్పుడు మళ్లీ కొల్లు రవీంద్రని వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి సమన్లు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి రమ్మంటూ రవీంద్రని వేధిస్తున్నారని చంద్రబాబు పేర్కోన్నారు. గతంలో కూడా వర్గాల మధ్య పోరులో జరిగిన హత్యకేసులో రవీంద్రని నిందితుడిగా చేర్చి 53 రోజులకు పైగా జైలులో పెట్టి వేధించారని, మళ్లీ ఎవరో భవన నిర్మాణ కార్మికుడి దాడిని సాకుగా చూపిస్తూ తిరిగి వేధించడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు.
అత్యుత్సాహం చూపకండి
పోలీసులు ప్రభుత్వ ప్రతినిధుల్లాగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పారు. మునుపు కూడా ఇలాగే ఒక ముఖ్యమంత్రిని నమ్ముకుని చెప్పిందంతా చేసి దాదాపు 12 మంది ఐఏఎస్, ఐపీయస్ ఆఫీసర్లు జైలుకు వెళ్లారని, ఇప్పటికీ కేసుల నుండి బయటపడలేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు, అది కాస్త దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రవర్తించాలని హితవు పలికారు. నీతి, నిజాయితిలతో చట్టానికి లోబడి పనిచేస్తే భవిషత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, చట్టాలు శాశ్వతం కాబట్టి మీ నడవడిక పైన మచ్చతెచ్చుకోకండి, అదే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు. ప్రభుత్వం చెప్పిందని కావాలని ఇబ్బందులకు గురి చేస్తే మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పోలీసులుకు వార్నింగ్ ఇచ్చారు.
తిరగబడితే ఆపగలరా?
తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. దాన్ని రూపుమాపడం ఎవరి తరం కాదన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే అందరి లెక్కలు తేల్చుతామని అన్నారు. మా కార్యకర్తలు తిరగబడితే వారిని నియంత్రించడం మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. ఎంత మంది పైన కేసులు పెట్టగలరు, ఎంతమందిని వేధింగలరు, ఇంకేమీ చేస్తారో చూస్తాను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 22 సంవత్సారాలు పాటు పాలించిన పార్టీ తెలుగుదేశం. చట్టం చేతిలో ఉంది కదాని మమ్మల్ని హింసించాలనుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.
నిజమైతే బహిర్గంతం చేయండి
ఏసీబీ కేసులు పెట్టారు, పోలీసులు కేసులు పెడ్తున్నారు, మరి వాటిని బహిర్గతంగా చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు. మీరు పెట్టిన కేసుల్లో నిజముంటే మీడియా సమక్షంలో కేసులను బయటపెట్టండి. ఎవరిపైన కేసులు పెట్టినా అధైర్యపడకండి, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. మీ సమస్యను బహిర్గతం చేయండి, మీకు అండగా నిలబడి పోరాడడానికి మేమున్నాము. ప్రభుత్వ చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలపై సమిష్టిగా పోరాటి కట్టడి చేద్దాం. వారి అఘాయిత్యాలకు వెరవకండి, మీ గౌరవాన్ని చంపుకోకండి, నిందలకు భయపడకండి, ముందుకు వచ్చి పోరాడి సమాజానికి మన నిజాయితీని నిరూపించాల్సిన సమయమిది. అదే సమయంలో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదు, బీ కేర్ ఫుల్ అంటూ పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇరికించే పన్నాగం
కొల్లు రవీంద్రని ప్రభుత్వం టార్గెట్ చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. వర్గ పోరును, వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి కొల్లు రవీంద్రను నిందితుడిగా పేర్కోని జైలుపాలు చేసి వేధించారు. బెయిలుపై బయటకు రావడంతో తిరిగి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం అదే నియోజకవర్గంలో మంత్రిపై జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని రవీంద్రని అందులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా తెలిస్తుంది. ప్రతిపక్షమే ప్రభుత్వ టార్గెట్ అనేది విస్పష్టం.
రోజంతా వెంటే ఉన్నాడు
పేర్ని నాని తల్లి దశ దిన కర్మ రోజున ఈ దాడి జరిగింది. ఆ సమయంలోని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజంతా మంత్రి అనుచరులతో పాటు నిందుతుడు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీన్ని గమనిస్తే, అది దాడా లేక ముందుగా చేసుకున్న ప్రణాళిక అనిపిస్తుంది. నియోజకవర్గంలో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మంత్రి గారే ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు సొంత పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం అరోపిస్తున్నట్లు నిందితుడు టీడీపీ సానుభూతి పరుడే అయితే రోజంతా మంత్రి వెంటే ఉంటే ఆయన అనుచరులు అతన్ని ఎందుకు విచారించి దూరం పెట్టలేదు అనే అనుమానాలు ఉన్నాయి.
మంత్రి పేర్ని నానితోనే ఉండే వ్యక్తి, ఆయనపైనే హత్యాయత్నం చేసాడంటే.. ఇదంతా మరో కోడి కత్తి డ్రామాలాంటిదని వేరే చెప్పాలా? కొల్లు రవీంద్రగారి వంటి తెలుగుదేశం బీసీ నేతను రాజకీయంగా అణిచేసే కుట్ర ఇది. పోలీసులు ఇకనైనా రవీంద్రగారిని వేధించడం ఆపి, మంత్రిని విచారించి నాటకం గుట్టు బయటపెట్టాలి pic.twitter.com/XAkDnzcUMx
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 5, 2020
ఇదే విషయాన్ని టీడీపీ నేత లోకేష్ తన ట్వీట్టర్ ద్వారా కూడా ప్రశ్నించారు. కానీ వేటికీ ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. కేవలం అర్ధం పర్థం లేని ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుల్ని ఇరికించి ఇబ్బందిపెట్టడమే తమ ధ్యేయంగా పెట్టుకుంది ప్రభుత్వం. మరి అలాంటి వారు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా? తామేది చేయాలనుకుంటే అదే చేస్తారు?
Also Read: సిక్స్ ప్యాక్ దిశగా నారా లోకేష్.. లేటెస్ట్‌గా చూశారా?