కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయాన్ని అమల్లోకి తేబోతోంది. ఇందుకోసం కీలక నిర్ణయాలను కూడా సోమవారం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో గ్రామాల్లో అయితే 3 సెంట్లు, టౌన్స్‌లో అయితే 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జగన్ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున ఇచ్చి డబ్బా కొట్టుకుంది. ఈ స్థలం రిషికొండలో జగన్ నిర్మించుకున్న విలాసవంతమైన ప్యాలెస్‌లో బాత్రూం సైజు కన్నా చిన్నగా ఉంటుంది.
తాజాగా చంద్రబాబు సర్కారు దానికి రెట్టింపు ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత ఇంటి వసతి కల్పించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్లు, వచ్చే సంవత్సరంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్, కేపీహెచ్‌బీ తరహాల్లో కేంద్ర పథకాలతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు.
పైగా పోలవరం పునరావాస ఇళ్లు గృహనిర్మాణ శాఖకు అప్పగించారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగింతపై చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతితోపాటు తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై.. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
పైగా చంద్రబాబు రెవెన్యూ శాఖలోనూ జగన్ కు ఝలక్ ఇచ్చే మరో నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రచార కాంక్షతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటోతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు తీసేసి ఏపీ రాజముద్రతో ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. పొలాల సరిహద్దుల వద్ద రాళ్లపైన జగన్ రెడ్డి తన బొమ్మలు వేయించుకోవడం కోసం రూ.650 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. జగన్ చిత్రం ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలని చర్చించగా.. ఆ రాళ్లపై జగన్ బొమ్మలు తీసేయాలంటే మరో 15 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అయ్యిందని అన్నారు. ఇలా చంద్రబాబు ఒకేరోజు గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖలపై నిర్వహించిన రివ్యూ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.











