అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఆర్డీఏ ఏర్పాటులో కీలకంగా వ్యవహించడంతో పాటు, అమరావతి రాజధానికి భూముల సమీకరణలోనూ చెరుకూరి శ్రీధర్ చురుగ్గా వ్యవహరించారు. దీంతో సీఐడీ అధికారులు చెరుకూరి శ్రీధర్‌ను ఇవాళ విజయవాడ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో చెరుకూరి శ్రీధర్ నుంచి సమాచారం లాగేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అసైన్డ్ భూముల సేకరణ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒత్తిడి ఏమైనా అధికారులపై ఉందా అనే విషయాన్ని కూడా సీఐడీ ఆరా తీస్తోంది.
గుంటూరు మాజీ కలెక్టర్ కాంతిలాల్ దండేకు సీఐడీ నోటీసులు
గుంటూరు మాజీ కలెక్టర్ , సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతిలాల్ దండేకు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమరావతి భూసేకరణ మొత్తం గుంటూరు జిల్లాలోనే ఉండటం, అప్పట్లో జిల్లా కలెక్టర్ గా కాంతిలాల్ దండే పనిచేయడంతో ఆయన నుంచి సమాచారం సేకరించేందుకు సీఐడీ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. భూ సమీకరణ సమయంలో మంగళగిరి ఎమ్మార్వోగా పనిచేసిన ఓ అధికారికి కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి రాజధానికి భూ సమీకరణలో అసైన్డ్ భూములను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనే విషయాలను అప్పటి అధికారుల నుంచి సమాచారం సేకరించేందుకు సీఐడీ పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలుస్తున్నారని తెలుస్తోంది.
Also Read: – సిల్లీ కేసులతో చంద్రబాబును భయపెట్టలేరు : టీడీపీ నాయకులు