అమరావతిలో అసైన్డ్ భూములు సేకరించారంటూ సీఐడీ చంద్రబాబు, నారాయణలకు నోటీసులు జారీ చేయగా సీఎం జగన్‌పై కూడ కేసులు నమోదు చేయాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమరావతి భూసేకరణ వ్యవహారానికి సంబంధించి మంగళవారం ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు బుధవారం మాజీ మంత్రి నారాయణకు నోటీసు ఇవ్వటంతోపాటు ఆయన నివాసాలు, కళాశాలలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్‌లోని నారాయణ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసు ప్రకారం.. ఈనెల 22న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇదే వ్యవహారంపై చంద్రబాబుపై పెట్టిన కేసులే నారాయణపైనా పెట్టారు. కాగా చంద్రబాబుని మార్చి 23న సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదు చేసింది.
న్యాయనిపుణులతో చంద్రబాబు భేటీ..
కాగా సీఐడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించారు. పార్టీకి చెందిన కీలక నాయకులతో మాట్లాడిన చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందని, భయపెట్టాలని చూస్తోందని, ఇప్పటి వరకు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు తనవరకు వచ్చారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. న్యాయనిపుణులతో మాట్లాడిన అనంతరం.. గురువారం హైకోర్టును ఆశ్రయించనున్నారు.
హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు..
కాగా అమరావతి రాజధాని భూసేకరణలో ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దళితుల నుంచి అతికిరాతంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని విమర్శించారు. ఆ ప్రకారం చూస్తే.. సీఐడీ అధికారులు అసైన్డ్ భూముల విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లతో సీఎం జగన్‌తో పాటు సంబంధిత మంత్రి, బాధ్యుడైన అధికారిపైనా కేసు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అసైన్డ్ భూముల లాక్కున్న విషయంపై వివరాలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, సీఐడీ అధికారులు జగన్‌పై కేసు పెట్టేందుకు నిరాకరిస్తే తాను న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు. గతంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దివంగత సీఎం వైఎస్‌ఆర్‌లు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైసీపీ సర్కారు బలవంతంగా లాక్కుందని విమర్శించారు.
కక్ష సాధింపు చర్యలు
మరోవైపు మరో టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర కూడా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం విద్వేషపూరిత రాజకీయాలకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. తమకు అన్యాయం జరిగిందని రాజధానికి భూములిచ్చిన దళితులు ఇంత వరకు చంద్రబాబుపై ఫిర్యాదు చేయలేదని, కాని ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. జీవో నెం-41 ప్రకారం చంద్రబాబు దళితులకు అన్యాయం చేస్తే..జీవోనెం-72 ఇచ్చిన జగన్ కూడా అన్యాయం చేసినట్లేనని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.
Must Read ;- తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు