వినుకొండలో కారాల మిరియాలు నూరుతున్న నేతలు..
వినుకొండ నియోజకవర్గంలో అధికార వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది! నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు మాట, చేత తీరు చూసి కేడర్ ఆయనకు ఎప్పుడో దూరమైంది. పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేతో అంటిముట్టినట్లు వ్యవహిరిస్తున్నారు. మరోవైపు జగన్ రెడ్డిని నమ్మి నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు బొల్లా బ్రహ్మనాయుడుతో 2019 ఎన్నికల్లో జతకట్టారు. ఆయన వర్గం పూర్తిగా బ్రహ్మనాయుడు గెలుపు కోసం పనిచేశారు. అయితే మక్కెనకు ఎమ్మెల్సీ లేదా జిల్లా స్థాయి నామినేట్ పదవులు కట్టపెడతాం అన్న ఆ నాటి హామీ నేటికి నెరవేర్చలేదు. ఇదిలా ఉంటే పెత్తనమంతా బొల్లానే చేస్తూ.. మక్కెన వర్గాన్ని పక్కకునెట్టి.. సొంత కేడర్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు ఎమ్మెల్యే బొల్లా. ఈ క్రమంలో మక్కెన వర్గంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. ఇంకోవైపు ఈ సారి వినుకొండ సీటును తనకు కేటాయించాలని అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు. దీంతో వినుకొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ గా మారింది. ఎంపీ లావు కూడా తన సొంత కేడర్ ను నియోజకవర్గంలో బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న సొంత పార్టీకి చెందిన నేత, రైతు నరేంద్ర ను చెప్పు తీసుకుని కొట్టబోయి, వివాదంలో ఇరుక్కున్నారు బొల్లా. అంతటితో ఆగకుండా నరేంద్రపై అక్రమ కేసు కట్టించి, కటకటాల పాలు చేశాడు. ఇదే అదునుగా ఇష్యూను ఎంపీ సీరియస్ గా తీసుకున్నారు. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, పార్టీ కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఎమ్మెల్యే బొల్లా మాటవిని అక్రమ కేసు నమోదు చేసిన సీఐ అశోక్ కుమార్ పై డిజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సదురు కేసు నమోదు చేసిన సీఐ సస్పెండ్ అయ్యాడు.
నరేంద్ర కేసుతో బయటపడ్డ నేతల మధ్య పొరపచ్చాలు..!
నరేంద్ర పై నమోదు చేసింది అక్రమ కేసు.. ఇందులో నరేంద్ర తప్పలేదు అన్నది ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల వాదన. ఎమ్మెల్యే బొల్లానే నరేంద్రను చెప్పుతో నా ముందే కొట్టబోయాడు, నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు, అదికాక తన పీఏతో అక్రమ కేసు కట్టించాడు అన్నది వాస్తవం కాదా? అని ఎంపీ పాయింట్ ఆఫ్ వివ్ లోని అంశాలు. మరోవైపు ఎమ్మెల్యే బొల్లా మరొలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. నరేంద్ర అనే వ్యక్తి ముఖ్యమంత్రిని తిట్టి, తన పీఏ పై దాడికి యత్నించాడు.. అందుకే కేసు పెట్టామని వాదిస్తున్నారు బొల్లా. అలానే ఈ అంశంలో రూరల్ సీఐ అశోక్ తప్పు లేదని, తన సస్పెన్స్ ను ఎత్తివేయాలని నేరుగా సీఎంకు విన్నవించగా.. సీఐ సస్పెన్స్ ను రోజుల వ్యవధిలోని ఎత్తివేయించి తిరిగి పోస్టింగ్ ఇప్పించి పంతం నెగ్గించుకున్నారు బొల్లా. ఇక్కడి వరకు బాగానే ఉంది.. ఆ తరువాత రాజకీయం రసకందాయంలో పడింది. ఎంపీ స్థాయిలో వైసీపీ నేత నరేంద్రను కాపాడటంలో వెనకడు వేయాల్సి వచ్చిందని కృష్ణదేవరాయలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వినుకొండ సీటును ఎంపీ అడుగుతున్నాడని తెలిసిన నాటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా లావుతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారు. ఇదికాస్తా.. నరేంద్ర కేసుతో ఒక్కసారిగా ఇరువురి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నా నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఏమిటని బొల్లా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నరేంద్ర ను బయటకు తీసుకొచ్చేందుకు ఎంపీ శతవిధాలుగా ప్రయత్నింస్తున్నారు. ఏదిఏమైన వినుకొండలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య వర్గ విభేదాలు నెక్స్ట్ లెవల్ అన్నట్లుగా తయారయ్యాయనే చెప్పవచ్చు!
Must Read:-తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్