నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ పార్టీలకు అభ్యర్థుల ఎంపిక పరీక్షగా మారింది. నియోజకవర్గంలో అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీలో ఉన్న నేపథ్యంలో అసమ్మతి తలెత్తుతుందనే టెన్షన్ కూడా పార్టీల్లో మొదలైంది. ఇక బీజేపీలో ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి సతీమణి, 2018 ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గంలో పోటీ చేసిన కంకణాల నివేదితరెడ్డి నామినేషన్ దాఖలు చేయడం ఆ పార్టీలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీనియర్ నాయకులతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఇక్కడ నివేదితరెడ్డితో పాటు డాక్టర్ రవి నాయక్, ఇంద్రసేనారెడ్డి, కడారి అంజయ్య యాదవ్ పేరు వినిపిస్తున్నాయి. కడారి అంజయ్య యాదవ్ 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా దాదాపు 30 వేల ఓట్లు వచ్చాయి. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన కంకణాల నివేదితరెడ్డికి 2675 ఓట్లు వచ్చాయి. ఇక సామాజికవర్గ పరంగా చూస్తే బీసీ, ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టిక్కెట్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జానారెడ్డిని ఢీకొట్టే బలమైన అభ్యర్థి ఉండాలనే డిమాండ్ కూడా కేడర్ నుంచి వస్తోంది.
రెబెల్స్ కు అవకాశం లేకుండా టీఆర్ఎస్
ఇతర పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులను బట్టి టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ఎంపిక చేస్తుండడం, చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేసి ఇతర పార్టీలకు, అసమ్మతులుకు, రెబెల్స్‌కు అవకాశం ఇవ్వకుండా చేయడం లాంటి వ్యూహాలను టీఆర్ఎస్ అమలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఇక్కడ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాక తాము అభ్యర్థిని ప్రకటించే యోచలో టీఆర్ఎస్ ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాక టీఆర్ఎస్ అసమ్మతులను, రెబల్స్‌ని తమవైపు తిప్పుకుని అంతా చక్కదిద్దవచ్చనే ఆలోచనతో బీజేపీ ఉంది. దీంతో ఇక్కడ రెండు పార్టీల ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జానారెడ్డి పేరును ప్రకటించింది. మొత్తం మీద టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేయాలని ఇప్పటికే బీజేపీ తమ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.
టీఆర్ఎస్ నుంచి చూస్తే..
ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపిక వరకు టీఆర్ఎస్ వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ఇక్కడ దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పేరుతో పాటు కోటిరెడ్డి, మన్నె రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, తేరా చిన్నపరెడ్డి, గతంలో జానారెడ్డిపై గెలిచిన రామ్మూర్తి యాదవ్ అల్లుడు గురువయ్య యాదవ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తారనే అంచనాకు పార్టీనాయకులే రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగైనా సరే..ఇక్కడ గెలిచి తీరాలని, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఆదేశాలు అందాయి. పార్టీ అభ్యర్థిని ప్రకటించకున్నా.. నియోజకవర్గంలోని ఏడు మండలాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగించారు. హరీష్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావులకు బాధ్యతలు అప్పగించడంతోపాటు ఎమ్మెల్యేలకు మండలాల బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీ అభ్యర్థిని ప్రకటించాక అసమ్మతి తలెత్తకుండా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని వారు క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్‌ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.
అమరవీరుల ఫోరం టెన్షన్..
ఓవైపు పార్టీ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్, బీజేపీ కసరత్తు చేస్తుండగా తెలంగాణ అమరవీరుల ఫోరం షాక్ ఇచ్చింది. తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకు నిరసనగా దాదాపు 400మంది నామినేషన్లు దాఖలు చేస్తారని ఫోరం ప్రకటించింది. దీంతో పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే.. తెలంగాణలోని ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి నిలిపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇప్పటికే మొవ్వ అరుణ్‌కుమార్ పేరును ప్రకటించింది.
ఒక్కరోజే ఛాన్స్..
మార్చి 23న నామినేషన్ల స్వీకరణ మొదలైంది. గురువారం సాయంత్రం వరకు 23నామినేషన్లు దాఖలయ్యాయి. 20మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉండడంతో మళ్లీ మార్చి 30న నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు నామినేషన్లకు చివరి తేదీ కూడా కావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మార్చి 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. 27న బహిరంగ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు కూడా అదే రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Must Read ;- కాంగ్రెస్ VS టీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ.. సాగర్ ఈదేదెవరో..?