కొవిడ్ కట్టడితో తెలంగాణ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక కార్యకాలాపాలు పుంజుకుంటున్నాయి. అంతర్ రాష్ట్రాల రాకపోకలు సైతం మొదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ.. క్రమక్రమంగా కోలుకుంటోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రిలోని కొవిడ్ బెడ్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన సాధారణ సేవలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.
91 శాతం బెడ్స్ ఖాళీ
ఆసుపత్రికి వచ్చే కరోనా రోగుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఆస్పత్రుల్లో కేటాయించిన పడకలను తిరిగి సాధారణ పడకలుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 91 శాతం కొవిడ్ పడకలు ఖాళీ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 55,442 కొవిడ్ బెడ్స్ ఉన్నాయి. కొవిడ్ కట్టడిలోకి రావడంతో రోగుల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. ఫలితంగా బెడ్స్ ఖాళీగా మారాయి. గురువారం కేవలం 4,931 (8.89) శాతం పడకలు మాత్రమే నిండాయి. ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్ సైతం ఖాళీగానే దర్శనమిచ్చాయి. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యాలు సాధారణ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 250 పడకలు ఉన్న చిన్న ఆసుపత్రులు సాధారణ పడకలుగా మార్చేశాయి.
కొత్త కేసులు 917
తెలంగాణలో కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు నిర్వహించగా, 917 మందికి పాజిటివ్ గా అని తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 కొత్త కేసులు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మాత్రం ఒక కేసు నమోదైంది. 1,006 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3,661 మంది కరోనాతో చనిపోయారు. కరోనా కట్టడిలోకి రావడంతో తెలంగాణలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
Must Read ;- తెలంగాణలో ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు