కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆంక్షలను సడలిస్తున్నాయి. ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకునేందుకు కర్ఫ్యూ నిబంధనలను సైతం సడలిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం కావడంతో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్నాయి.
100 రోజుల తర్వాత 40 వేల కేసులు
వంద రోజుల తర్వాత కొత్త కరోనా కేసుల సంఖ్య 40 వేల కన్నా తక్కువగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 56,994 మంది కోలుకున్నారు. నిన్న 907 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,93,66,601 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 5,52,659 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక రికవరీ రేటు 96.87 శాతంగా ఉంది.
ఇండియా రికార్డ్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యువత నుంచి పెద్దల వరకు పిట్టల్లా రాలిపోయారు. ముప్పును గ్రహించిన కేంద్రం.. టీకా ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా కొన్ని కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గింది. కరోనా నివారణలో వ్యాక్సిన్ ప్రధాన ఆయుధమని భావించినా రాష్ట్రాలు సైతం టీకా పంపిణీని మరింత వేగవంతం చేశాయి. దీంతో వ్యాక్సినేషన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించి భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు యూఎస్ తమ ప్రజలకు 32.3 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. భారత్ 32.36 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ముందంజ నిలవడం విశేషం.
Must Read ;- ‘డెల్టా’ ప్రమాదకరం.. వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు సురక్షితం