ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు మరోసారి చురకలు వేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను కొందరు రాజకీయం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అయితే అందరికీ టీకా వేయడం సాధ్యం కావడం లేదన్నారు. దీనిపై పోలీసు ఉద్యోగ సంఘాలతో చర్చించినట్టు సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్ చేయించుకోవడాన్ని త్యాగం చేస్తామని పోలీసు ఉద్యోగ సంఘాలు చెప్పాయని సవాంగ్ గుర్తు చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయానికి గర్విస్తున్నట్టు మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఆయన చెప్పారు.
Must Read ;- డీజీపీ, హోంసెక్రటరీ హైకోర్టుకు హాజరుకావాలి!











