సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆ సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని దూళిపాళ్ల నరేంద్ర తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాసేపట్లో వారు ఏసీబీ కోర్టులో పిటీషన్ వేయనున్నారు.
ఎండీ గోపాలకృష్ణకు కూడా తీవ్ర అస్వస్థత
సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న ఎండీ గోపాలకృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడటంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్టులు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.











