తెలుగు చిత్ర సీమ టాలీవుడ్ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం చర్యలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తున్నాయి. గతంలో ఓ దఫా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా సానుకూల వాతావరణంలోనే చర్చలు జరిగినట్లుగా రెండు వర్గాలు కూడా ప్రకటించాయి. మరో దఫా భేటీ అయి చర్చిద్దామంటూ ఇరు వర్గాలు కూడా సమ్మతి తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశాయి. ఆ రెండో దఫా సమావేశాన్ని ఈ నెల 4న (శనివారం) నిర్వహించనున్నట్లుగా టాలీవుడ్ నుంచి వార్తలు వినిపించాయి. ఈ మేరకు జగన్ కూడా టాలీవుడ్ ప్రముఖులకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టుగా కూడా కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి శుక్రవారం నాటి దాకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ సమావేశాన్ని జగన్ వాయిదా వేసినట్లుగా శుక్రవారం సాయంత్రం వార్తలు వినిపించాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషిస్తూ ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.
స్టాలిన్ తో చిరు భేటీనే కారణమా?
ఇటీవలే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎంగా పనితీరులో స్టాలిన్ మెరుగ్గా రాణిస్తున్నారని కీర్తించారు. సీఎం హోదాలో ఉండి రాజకీయాలు మాట్లాడరాదని, పార్టీ వ్యవహారాలు మాట్లాడాల్సి వస్తే.. పార్టీ ఆఫీసుకే వెళదామంటూ సొంత పార్టీ నేతలతోనూ స్టాలిన్ చెబుతున్నారట. మరోవైపు స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా ఏ పార్టీకి చెందిన నేత ఇంట ఓ కార్యం జరిగినా కూడా స్టాలిన్ పరుగెత్తుకుంటూ వెళుతున్న వైనాన్ని కూడా భేటీ సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇలాంటి వైఖరితో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీరు ఆదర్శంగా నిలిచారని కూడా స్టాలిన్ ను చిరు ఆకాశానికెత్తేశారట. ఇండియా టుడే సర్వేలో కూడా స్టాలిన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన వైనాన్ని గుర్తు చేసిన చిరు.. స్టాలిన్ బెస్ట్ సీఎం అంటూ కితాబిచ్చారట. ఈ భేటీ వివరాలు తెలిసినంతనే.. జగన్ నొచ్చుకున్నారన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపించాయి. స్టాలిన్ బెస్ట్ సీఎం అయితే ఇక తామేంటని కూడా జగన్.. చిరు వ్యవహారంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారన్న మాట కూడా కాస్తంత గట్టిగానే వినిపించింది. ఈ నేపథ్యంలోనే చిరు నేతృత్వంలో తన వద్దకు వచ్చే టాలీవుడ్ ప్రముఖులతో భేటీని జగన్ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.
వారం ఆగి ఉంటే సరిపోయేదేమో
ఎలాగూ జగన్ తో భేటీకి పిలిచారని, మన సమస్యలు ఏమిటన్న వాటిపై ముందుగా మనం ఓ సమావేశం నిర్వహిద్దామంటూ చిరు ఇచ్చిన పిలుపునకు టాలీవుడ్ ప్రముఖులు భారీగానే స్పందించారు. హైదరాబాద్ లోని చిరు నివాసం వేదికగా ఈ సమావేశం జరిగింది. జగన్ తో భేటీలో చర్చించాల్సిన అంశాలను నిర్దేశించుకునేందుకే ఈ భేటీ నిర్వహించామన్న మాట కూడా వినిపించింది. జగన్ తో భేటీకి తేదీ ఖరారు అయిన నేపథ్యంలోనే చిరు ఈ సమావేశాన్ని నిర్వహించారని నాడు వార్తలు వచ్చాయి. అయితే జగన్ తో భేటీ (ఈ నెట 4)కు ఓ నాలుగు రోజులు ముందుగా స్టాలిన్ ను చిరు కలవడం, స్టాలిన్ ను ఆకాశానికెత్తేస్తూ చిరు ప్రశంసల వర్షం కురిపించడం.. ఈ విషయం తెలిసి జగన్ వారితో భేటీనే వాయిదా వేసేయడం వరుసగా చోటుచేసుకున్నాయన్నది ఇప్పుడు వినిపిస్తున్న కొత్త వాదన. అంటే.. ముందుగా అనుకున్న ప్రకారం జగన్ తో భేటీ తర్వాత చిరు స్టాలిన్ వద్దకే కాకుండా ఇంకెవరి వద్దకు వెళ్లినా పెద్దగా సమస్య వచ్చేది కాదని, అలా కాకుండా చిరు ఏ ఉద్దేశ్యంతో స్టాలిన్ ను కలిశారో గానీ.. టాలీవుడ్ తో జగన్ భేటీనే వాయిదా పడిపోయిందన్న వాదనలు ఇప్పుడు వైరల్ అయిపోయాయి.
Must Read ;- అప్పులకు జగన్ చెప్పిన కారణాలివే











