అమరావతి ఉద్యమం ఎల్లలు దాటింది. ఇక్కడి రైతులకు మద్దతుగా ఎక్కడో ఉన్న తెలుగువారూ పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. అమెరికాలో ఓ ప్రవాసాంధ్రుడు దీక్షకు దిగారు. డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ బాబు.. అమెరికాలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. తొమ్మిది రోజులుగా దీక్షను కొనసాగిస్తున్నారు. అమరావతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
అమకావతి కోసం..
రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామంటూ తక్షణమే ప్రకటించాలని డాక్టర్ లోకేశ్ బాబు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఆగ్నేయాసియాలోనే అత్యుత్తమ ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతుందని, దేశానికి, రాష్ట్రానికి లక్ష కోట్ల డాలర్ల సంపదను తెచ్చిపెడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం అపూర్వ త్యాగం చేసి భూములిచ్చిన రైతుల్ని వేధించడం సరికాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్న లోకేశ్‌బాబు స్వస్థలం గుంటూరు జిల్లా ముట్లూరు. అమరావతి పరిరక్షణ, వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 13న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన డిమాండ్లను వినిపించారు.
ఈవిఎంలు వద్దు.. బ్యాలెట్ పేపరే ముద్దు..
భారత్ లో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలి. ఇకపై జరిగే ఎన్నికలన్నింటినీ బ్యాలట్ పత్రాలతోనే నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు. ఇకపై అలాంటివి జరక్కుండా నిరోధించేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలి. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ తక్షణమే ప్రభుత్వం ప్రకటన చేయాలి. అలా చేయని పక్షంలో.. కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మతమార్పిళ్లు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!