(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తుండటంపై వైఎస్సార్సీపీ నేతల మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండదన్న విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటే… అమ్మో.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉంది.. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కరంటే… కౌరవసేన అంతా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. అంతిమంగా కోర్టుల జోక్యంతో ఎన్నికలకు వెళ్లాల్సి తప్ప లేదు. ఒకవైపు వైరస్ ప్రబలే ప్రమాదం… మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ… ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఎన్నికలు మూడు నెలలపాటు వాయిదా వేయాల్సిందే అన్నారు. దీనిపై విస్తృతంగా ప్రకటనలు చేసిన అధికార పార్టీ నేతలు… ఆ వ్యాఖ్యలను అన్నింటినీ పాతర వేస్తూ.. శనివారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
పొంచి ఉన్న ప్రమాదం..
అన్ని కబుర్లు ఆడిన అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ నేతలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ పాదయాత్ర కు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర అన్ని నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి… భారీ సమూహాన్ని ఒక చోటుకు చేర్చారు. పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పాదయాత్ర వల్ల ప్రయోజనం ఉందో లేదో తెలియదు కానీ.. ప్రమాదం అయితే పొంచి ఉన్నట్టు స్పష్టమవుతోంది.
Must Read ;- విజయసాయిరెడ్డి పాదయాత్ర.. అసలెందుకో?
మాస్కులు మరిచారు..
వందలాదిగా హాజరైన కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీ నాయకులు కరోనా వైరస్ గురించి అంత హడావిడి చేసినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు కూడా మాస్కులు లేకుండా ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కొంతమందికి అక్కడక్కడ మాస్కులు కనిపిస్తున్నా అది నోటికి కాకుండా మెడకు అలంకరణగా కనిపిస్తోంది. ఇన్ని వేల మంది నగరమంతా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పాదయాత్ర నిర్వహించడంపై విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. “ మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తారా?” అని నిలదీస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అనేక దేశాలు వైరస్ తాకిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఇటువంటి దశలో నిర్వహిస్తున్న పాదయాత్రను పాలకపక్షం ఎంత నిర్లక్ష్యంగా చేపట్టిందో హాజరైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పాదయాత్రను సాగిస్తూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. సామాజిక దూరం విషయాన్ని పక్కన పెడితే… కనీసం ముఖానికి మాస్కులు కూడా ధరించకుండా వందలాదిమంది ఒకేచోట ఎలా చేరతారని ప్రశ్నిస్తున్నారు. ఈ యాత్ర వల్ల స్టీల్ ప్లాంట్‌కు లాభం చేకూరుస్తుందో లేదోగాని.. ప్రజల ఆరోగ్యానికి చేటు తప్పదని భయపడుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యమం పేరిట ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్న అధికార పార్టీ తీరుపై మండి పడుతున్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో వైరస్ కేసులు పెరిగితే అందుకు పూర్తి బాధ్యత ఎంపీ విజయసాయిరెడ్డి అండ్ కో దే అని స్పష్టం చేస్తున్నారు.
Must Read ;- జగన్ ప్రకటనపై అనుమానాలెన్నో.. విశాఖ ఉక్కు భూముల విక్రయం సాధ్యమా..?