ఉద్యోగుల పోరుబాట..!
ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. ముందు 50 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్ ను గుర్తు చేసి మరి.. జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించారు. చివరికి 23 శాతం ఫిట్మెంట్ ను సీఎం ఎదుట ఒప్పుకుని తల ఊపుకుంటూ బయటకొచ్చారు జేఏసీ నేతలు! అలా ఎలా ఒప్పుకున్నారని ఉద్యోగులు లాగి గూబ మీద ఒక్కటిస్తే, తత్వం బోధపడి నాలుక కరుచుకున్నారు జేఏసీ నేతలు. ఆ నాటి నుంచి ఉద్యోగ్య సంఘాల నేతలపై ఉద్యోగుల తీవ్ర ఒత్తిడి అధికమౌతోంది. మీరే అదుకోవాలని సజ్జలను, సీఎంఓ అధికారి ధనుంజయరెడ్డికి వివరించామని బుధవారం ఏపీ జేఏసీ నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు తెలిపారు. హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్లకు అదనపు బెనిఫిట్ ఇవ్వాలని కోరామని, అందుకు గురువారం వరకు సమయం కోరినట్లు వారు తెలిపారు. ఇప్పటికే అదనపు పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు సమ్మెబాట పట్టాయని గుర్తు చేశారు. గురవారం వరకు సమయం అడిగామని, ఈ లోగా ప్రభుత్వం తరఫు నుంచి పరిష్కారం దొరకకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హెచ్ఆర్ఏ అమలైతే తీవ్రంగా నష్టపోతాం..!
హెచ్ఆర్ఏ అమలైతే తీవ్రంగా నష్టపోతామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఈ హెచ్ఆర్ఏ ద్వారా నష్టపోతారని ఉద్యోగులు, సంఘాల నేతలు వాపోతున్నారు. వేల రూపాయాల జీతం కోత పడుతోందని, దీనిని ఒప్పుకునే ప్రసక్తే లేదని తెగసి చెప్పారు. గత ప్రభుత్వ హయంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్ఆర్ఏ శ్లాబ్ లను సైతం ఇప్పుడు మార్చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ( గురవారం ) మధ్యాహ్నంలోగా హెచ్ఆర్ఏ, సీసీఏ, రిటైర్మెంట్ ఉద్యోగులకు లభిస్తున్న అదనపు మొత్తంపై స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమం తప్పదని బండి శ్రీనివాస్, బొప్పరాజు హెచ్చరించారు.











