టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయం రాజుకుంటోంది. ఖమ్మంలో త్రిముఖ పోటీ నెలకొంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అజయ్ మంత్రి కావడంతో జిల్లాలో ఆయన హవానే నడుస్తోంది. అయితే.. మంత్రి తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తుమ్మల వర్గం ఆరోపిస్తోంది. కావాలనే.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని పొంగులేటి వర్గం విమర్శిస్తోంది. ఒకరిపై మరొకరు అసహనం వ్యక్తం చేసుకోవడం ఈ మధ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో వేంసూరులో పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
“అధికారం ఎప్పుడూ ఎవరి సొంతం కాదు.. ప్రజల అభిమానం, ఆశీర్వాదాలు తప్ప.. పదవులు ఎవడి అబ్బ సొత్తూ కాదు… నాకు ఎవరి ఫొటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు..” అంటూ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించడం.. రాజకీయంగా దుమారం రేగుతోంది. ఖమ్మం జిల్లా వేంసూరు పర్యటనలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొందరు సొంత పార్టీ వాళ్లే రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని కార్యకర్తలు చెప్పడంతో.. పొంగులేటి ఆవేశంగా మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కావాలనే కక్ష సాధింపు..
తన అభిమానులు, కార్యకర్తలపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదని పొంగులేటి హెచ్చరించారు. అందరం ఓకే గొడుగు కింద, ఓకే చెట్టు నీడలో ఉన్నామని.. పదవుల్లో లేనంత మాత్రాన చిన్నచూపు చూడొద్దని సూచించారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నారు. గెలుపోటములు సహజమని చెప్పారు. పదవులు రావాలని ఉంటే.. కలిసొచ్చే కాలం వస్తే ఎవ్వరూ ఆపలేరని పునరుద్ఘాటించారు. అలాగే పదవులు పోవాలని ఉన్నప్పుడు కాంక్రీట్ గోడలు కట్టుకున్నా ఎవ్వరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల తర్వాత మంచిగా పరిపాలన చేస్తే తిరిగి అధికారంలో కూర్చోబెడతారని.. లేకపోతే ప్రజలే పక్కకు పెడతారని హాట్ కామెంట్స్ చేశారు.
ఎవరి అనుమతీ అవసరం లేదు..
ఈ రోజు ఎవరైతే పదువులు అనుభవిస్తున్నారో వారందరికీ ఆ పదవులు రావడానికి కారణం ఎవరో తెలుసని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను అభిమానించే వారు, ఆశీర్వదించే వారు తప్పకుండా వస్తుంటారని చెప్పారు. తాను ఎక్కడికి పోవాలన్నా ఎవరి పాస్‌పోర్ట్, పర్మిషన్ అవసరం లేదని అసహనం వ్యక్తం చేశారు.
Must Read ;- కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకున్నప్పుడు.. బీజేపీలో చేరతానన్న కొండా
ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందే..
తాత్కాలికంగా ఎవరు ఎలా ఉన్నా.. పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందేనని పొంగులేటి పరోక్షంగా అన్నారు. అదే గూట్లో గుడ్లు పెట్టాల్సిందేనని చెప్పారు. ప్రజల మనసును గెలవాలి కానీ.. రాజకీయం చేస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదన్నారు. వడ్డీ, చక్ర వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుందని, ఏ విషయాన్నీ తాను అంత సులభంగా మరచిపోనని పేర్కొన్నారు. ఈ రోజు తనతోపాటు మువ్వా విజయ బాబు, దయానంద్ పదవుల్లో లేకపోవచ్చని.. కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలిపారు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, కక్ష సాధింపు చర్యలు చేస్తే సహించేది లేదని, ఏం చేసినా చూస్తూ ఊరుకుంటానని అనుకుంటే.. మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఇంతకీ.. మంచిరోజులు వచ్చాయా? లేదా?
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికెళ్లి కలిశారు. దీంతో పొంగులేటిలో చాలామార్పు వచ్చింది. అప్పటివరకూ అంటీ ముట్టనట్టు ఉన్నాయన.. ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. మళ్లీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా తమ నేతకు మళ్లీ మంచిరోజులొచ్చాయని సంబురపడ్డారు. పార్టీ తరఫున తమ నాయకుడికి ‘మంచి హామీ’ కూడా వచ్చిందంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి హాట్ కామెంట్స్ మళ్లీ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకీ.. పొంగులేటికి మంచిరోజులు వచ్చాయా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read ;- దూకుడుగా బీజేపీ.. ఇంకా ఆలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు