తెలంగాణలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు తమ తమ స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా ఆశావాహులు ప్రజల్లో తిరుగుతూ తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్రోల్‌మెంట్ కార్యక్రమంలో ఆశావాహులు శక్తి వంచన లేకుండా పని చేశారు. తమ సమీప బంధువులు , స్నేహితుల సహకారంతో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. రెండు నియోజకవర్గాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా మిగతా పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. వారు అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తాయి.. ఎప్పటికి ప్రచారంలో ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజల్లోకి విస్తృతంగా బీజేపీ..
రెండింటిలో బీజేపీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉండగా తిరిగి ఆయనకే టికెట్ కేటాయించింది అధిష్టానం. దీంతో ఆయన ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన సర్కిల్ సహకారంతో గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే 3లక్షలకు పైగా ఎన్రోల్‌మెంట్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్న రాంచందర్‌రావు తన గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు. మరో స్థానమైన వరంగల్ , ఖమ్మం, నల్లగొండకు కూడా ఆ పార్టీ సీనియర్ నేత ప్రేమేంధర్‌రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం. దీంతో ఆయన తన పాత పరిచయస్తులను తట్టి లేపుతున్నారు. తన అభ్యర్థితత్వం ఖరారు కాక ముందే కేడర్ సహకారంతో ఎన్రోల్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు. నలుగురు ఐదుగురు పోటీకి వచ్చినా చివరికి ప్రేమేంధర్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏబీవీపి నేతగా ఉన్న రోజుల నుండి స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉండటం… ఇక బీజేపీ రోజురోజుకు బలం పుంజుకుంటుండటంతో తన గెలుపు పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ప్రేమేందర్‌రెడ్డి.
Must Read ;- కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకున్నప్పుడు.. బీజేపీలో చేరతానన్న కొండా

అభ్యర్థుల వేటలోనే మిగతా పార్టీలు
అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించ లేదు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి సిట్టింగ్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డినే తిరిగి పోటీ చేయాలని అధిష్టానం మౌకిక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన మొక్కుబడిగానే ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ చేయించారని.. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పోటీ చేయాలా వద్ద అన్న ఆలోచనలోనే ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, అధినేత కేసీఆర్ ఆయన్నే పోటీ చేయాలని సూచించడంతో మరోమారు తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరో స్థానం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారో తెలియని పరిస్థితి. అయితే, స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు గెలిచిన టీఆర్ఎస్ వారికే ఎన్రోల్‌మెంట్ బాధ్యతలు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నా టీఆర్ఎస్ నుండి ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడంతో ఆ పార్టీ కేడర్ ఆందోళనలో ఉంది.
కాంగ్రెస్‌లో గందరగోళం..
ఇక తెలంగాణలో మరో బలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేసినట్టు కనిపించడం లేదు. కొద్దిరోజుల క్రింత వరకు కూడా పీసీసీ అధ్యక్ష పీఠం కోసం నేతల కుమ్ములాటలకే సరిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థుల గురించి ఆలోచించే సమయమే లేకుండా పోయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీలో ఉన్నప్పటికీ మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరును ఖరారు చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మరో నేత హర్షవర్దన్ కూడా ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. మరో స్థానం వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానానికి ఇప్పటికీ ఏ అభ్యర్థి పేరు ప్రస్తావనకు రాలేదు. ఈ స్థానంలో పొత్తులో భాగంగా తమ పార్టీ నేత కాకుండా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో బలమైన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఆ పార్టీ వారు కాకుండా ఇతరులకు మద్ధతిస్తే ఎలా ఉంటుందని పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో ఎవరు మిగులుతారు.. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.
Also Read ;- పట్టు సడలుతోంది.. కవితమ్మ ఇలాకాలో టీఆర్ఎస్‌కు భారీ షాక్











