ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు లేక ముందు రిగ్గింగులు ఎక్కువగా జరిగేవి, ఈవీఎంలు వచ్చాక రిగ్గింగులు తగ్గాయి. అయితే దొంగ ఓట్లు వేయడంతో తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నాయకులు కొత్త దారులు వెతికారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓటు కలిగి ఉండి ఓటు వేయడానికి రాని ఓటర్ల కార్డులను వాలంటీర్ల ద్వారా సేకరించారని ప్రతిపక్షాలు గుర్తించాయి. ఎవరైతే ఓటు వేయడానికి రాలేకపోతున్నారో వారి ఓటును దొంగ ఓటర్ల ద్వారా వేయించుకునేందుకు పుంగనూరు, చిత్తూరు నుంచి వేలాది మందిని బస్సుల్లో తిరుపతి, శ్రీకాళహస్తికి తరలించారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా పట్టిచ్చినా ఈసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించింది. తిరుపతి ఉప ఎన్నికలు సజావుగా జరిగినట్టు ఎన్నికల అధికారులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యం ఖూనీ…
తిరుపతి ఉప ఎన్నిక ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేయాలో అధికార పార్టీ నేతలు ఇప్పటికే నిరూపించారు. ఇక భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా వాలంటీర్లే వైసీపీకి క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారికి ఏటా 1800 కోట్లు జీతాలు చెల్లిస్తూ, ఇంకా అధనంగా ముట్టజెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సరిగ్గా తిరుపతి ఉప ఎన్నికకు వారం రోజుల ముందే వాలంటీర్లను సన్మానించి వారికి రూ.350 కోట్ల నజరానా చెల్లించారు. ఇలా ఒక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోని వాలంటీర్లకు ప్రభుత్వం రూ.11 కోట్లు చెల్లించిందని టీడీపీ సీనియర్ నేత చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి, ఆ లక్ష్యాలను అందుకున్న వారికి బైకులు, కార్లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇక ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం మారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు వేలాది మందిని తరలించిన తీరు ప్రజాస్వామ్య వాదులను ఆందోళనకు గురి చేస్తోంది.
దొంగఓటర్లను పట్టించ్చిన వారినే అరెస్టులు
దొంగఓట్లు వేసేందుకు తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్యాణమండపంలో వేలాది మంది బస చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరశింహయాదవ్ అక్కడికి చేరుకుని రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని ఎందుకు వచ్చారని నిలదీశారు. అయితే వారు చెప్పిన సమాధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక క్యూలైన్లలో నిలుచున్న దొంగఓటర్లను పెద్ద ఎత్తున గుర్తించారు. ఓటరు కార్డులు తీసుకుని తండ్రి పేరు చెప్పాలని అడిగినా వారు చెప్పలేకపోయారు. కొందరు మహిళలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు.
144 సెక్షన్ టీడీపీ వారికేనా...
తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. ఒక రోజు ముందే టీడీపీ వారిని ఖాళీ చేయించి పంపించివేయించారు. ఇక అప్పటి నుంచి వైసీపీ నాయకులు ప్రతాపం చూపించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తరలించి కళ్యాణమండపాల్లో వారికి రాజమర్యాదలు ఏర్పాటు చేశారు. వేలాది మంది దండెత్తి రావడంతో టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. కానీ అధికారులు మాత్రం చోద్యం చూస్తుండిపోయారు. టీడీపీ నేతలు, కాంగ్రెస్, జనసేనబీజేపీ నేతలు వేలాది మంది దొంగఓటర్లను గుర్తించి నిలదీసినా పోలీసులు కనీసం కన్నెత్తి చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఓటరు ఓటు వేయడానికి వెళ్లే సమయానికి వారి ఓటు వేసి ఉండటం మరింత ఆందోళనకు గురి చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజారిటీ లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చేయని దురాగతాలు లేవని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా ఈసీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు, జనసేనబీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక రద్దు చేయాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహన్ ఈసీకి లేఖ రాశారు. అయితే వారి లేఖలు ఈసీ పట్టించుకుంటుందా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందా? అంటే అనుమానమేనని చెప్పాల్సి ఉంటుంది.
Must Read ;- తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ.. ఎంపీ రఘురామరాజు