తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ నాయకులు వెంకటేశ్వరస్వామి బొమ్మలు ఉన్న కరపత్రాలు పంచుతున్నారని జీవీఎల్ విమర్శించారు. వెంకటేశ్వరస్వామి బొమ్మ, సీఎం బొమ్మ, తిరుపతి ఎంపీ అభ్యర్థి బొమ్మలతో ఉన్న కరపత్రాలను తిరుపతి పార్లమెంటు పరిధిలో పంచుతున్నారని, వాటిని మీడియాకు జీవీఎల్ ప్రదర్శించి చూపించారు. ఎన్నికల నియమావళికి ఇలా చేయడం పూర్తి విరుద్దమన్నారు. వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను పూర్తిగా అతిక్రమించారని, దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు
ఆదరణ చూడలేకే..
తిరుపతిలో బీజేపీ, జనసేన అభ్యర్థికి వస్తున్న ఆదరణ చూడలేకే వైసీపీ నాయకులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి బొమ్మలను వాడుకోవడం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఎన్నికల తరవాత టీడీపీ మూటాముల్లే సర్దుకోవడం ఖాయమని, ఈ విషయం ఆ పార్టీ అధ్యక్షుడే మాట్లాడారని ఆయన అన్నారు. వాలంటీర్లే స్వయంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వాలంటీర్లతోనే వైసీపీ నాయకులు డబ్బు పంపిణీ చేయడం దారుణమని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
Must Read ;- ఎంపీ మాగుంట సైలెంట్.. వైసీపీకి మరో టెన్షన్