పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియంను దాదాపు రూ.13,500కోట్లకు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన, లండన్‌లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు తిరిగి తీసుకుచ్చేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భారత్‌కు వచ్చేందుకు నిరాకరిస్తున్న నీరవ్ మోదీకి చివరి రెండు ఛాన్స్‌లు మిగిలాయి. ఆ అవకాశాలు కూడా చేజారితే నీరవ్ మోదీని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించనుంది.
సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ముందే..
పంజాబ్ నేషన్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ముందే బ్రిటన్‌కు పారిపోయారు నీరవ్ మోదీ. దీంతో దాదాపు మూడేళ్ల నుంచి నీరవ్‌ను భారత్ తీసుకువచ్చేందుకు సీబీఐ, ఈడీ, విదేశాంగ శాఖలు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో హక్కుల ఉల్లంఘన జరుగుతోందనే కారణంతో పాటు కొవిడ్ ఉందని, మానసిక పరిస్థితి సరిగ్గా లేదని..ఇలా పలు కారణాలు చెబుతూ తప్పించుకుంటున్న నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్లను అక్కడి హోంశాఖ తిరస్కరించింది. అదే సమయంలో ఆయనకు అవకాశం ఇచ్చింది. హోంశాఖ నిర్ణయంపై అక్కడి హైకోర్టులో ఆయన అప్పీల్ చేసుకునేందుకు 14రోజుల గడువు ఇచ్చారు. తాజాగా ఆయన హైకోర్టులో తన అభ్యర్థనను దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఇదీ కేసు..
తమ ఖాతాదారులకు విదేశాల్లో ఉన్న తమ బ్యాంకుల శాఖల నుంచి, అనుబంధ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకునేందుకు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్‌ఓయూ) దుర్వినియోగం చేశారని పెరల్స్ (ముత్యాలు), వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతో పాటు మరికొందరిపై పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంపైనా ఫిర్యాదులు అందాయి. తీసుకున్న రుణాలను పక్కదోవపట్టించారని, హాంకాంగ్ , దుబాయ్ బ్యాంకులకు మళ్లించారన్న ఆరోపణలూ వచ్చాయి. దీంతో 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతో పాటు ఇతరులపై సీబీఐ, ఈడీలు కేసు నమోదు చేశాయి. అయితే జనవరి 18నే ఆయన భారత్ నుంచి విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో మే14న 25మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా 2019 డిసెంబరులో రెండో ఛార్జి షీట్‌ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిన నేపథ్యంలో 2019లో లండన్‌లో పట్టుబడ్డాడు.
తప్పించుకునేందుకు ప్రయత్నాలు..
కాగా 2003- నిందితుల అప్పగింత ఒప్పందంలో భాగంగా లండన్‌లో ఉన్న నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఈ క్రమంలో నీరవ్ మోదీ కూడా భారత్‌కు రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. అయితే ఆ పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టి వేశాయి.అరెస్టయ్యాక నీరవ్ మోదీని వాండ్స్ వర్త్ జైల్లో ఉంచారు. తరువాత కొవిడ్ కేసులను తెరపైకి తేవడం, భారత్‌లో హక్కుల ఉల్లంఘన ఉందని చెప్పడం, మానసిక ఆరోగ్యం బాగోలేదని చెప్పడం, జైల్లో సౌకర్యాలు ఉండవని మరో కారణం..ఇలా పలు అంశాలను ఎప్పటికప్పుడు నీరవ్ మోదీ తెరపైకి తెస్తూ భారత్‌కు వచ్చేందుకు నిరాకరిస్తుండడంతో భారత విదేశాంగ శాఖ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న నీరవ్ మోదీ పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అక్కడి కేసుకు సమాధానం చెప్పుకోవాలని చెబుతూ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అదే సమయంలో సీబీఐ, ఈడీల తరఫున అక్కడ న్యాయస్థానంలో ఓ హామీ కూడా ఇవ్వాల్సి వచ్చింది. నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలిస్తామని చెప్పడంతో పాటు జైల్లో ఏర్పాట్లపై నివేదిక కూడా ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అక్కడి హోంశాఖ దాదాపు రెండు నెలల తరువాత సీబీఐ, ఈడీ అభ్యర్థనపై విచారణ చేసి నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్‌కు వెళ్లాల్సిందేనని తేల్చింది.
సుప్రీంకోర్టు వరకు వెళ్తారా..
కాగా నీరవ్ మోదీని భారత్‌కు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధమైందనే వార్తలు వస్తున్నా.. నీరవ్ మోదీ హైకోర్టుకు వెళ్లేందుకు కూడా అక్కడి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంపై అక్కడి సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. అక్కడి న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలను వెల్లడిస్తాయనే అంశాన్ని బట్ట నీరవ్ మోదీ భారత్‌కు వస్తారా.. రారా అనేది తేలనుంది.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు చేయండి.. హైకోర్టులో ఎంపీ రఘురామరాజు పిటిషన్