పోలీసులు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లు కుమ్మక్కై తిరుపతి ఎన్నికలను ప్రహసనంగా మర్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకున్నారు..
స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారు. తిరుపతిలో స్థానికులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి. కానీ వారు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు. సరిహద్దులు మూసేసి తనిఖీలు చేసి పంపించాల్సి ఉండగా పోలీసులు చెక్‌పోస్టులను ఎత్తేశారన్నారు. బీజేపీ నాయకులు శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నా చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలను అరెస్టు చేశారని, ఇదెక్కడి ప్రజా స్వామ్యమని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వందల మందిని తీసుకొచ్చి పర్యాటకులు అంటున్నారన్నారు. వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైందని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చూస్తుంటే.. వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అక్రమాలపై ఈసీకి అన్ని ఆధారాలు సమర్పిస్తామన్నారు. వైసీపీ అక్రమాలను బయటపెట్టిన టీడీపీ శ్రేణులను అభినందిస్తున్నామన్నారు. తిరుపతి ఉప ఎన్నికను పూర్తిగా రద్దు చేయాలని, పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Must Read ;- తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం..