తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగఓట్లు వేయించేందుకు వైసీపీ ప్లాన్ చేసిందని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు రుజువుగా శనివారం పలుచోట్ల దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వ్యక్తులను గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అధికార వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని ఆధారాలతో సహా వీడియోలతో బయటపెట్టింది. దొంగఓట్లకు నిరసనగా తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి వద్ద టీడీపీ నేతలు నిరసనకు దిగారు. బయటి నుంచి వస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోగా తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆందోళన చేపట్టారు. కొన్నిచోట్ల బస్సుల్లో వస్తున్న నకిలీ ఓటర్లను బస్సుల్లోనుంచి దింపివేసిన ఘటనలూ చోటుచేసుకున్నాయి.
బస్సులు, కల్యాణమండపాల్లో ఓటర్ల తరలింపు..
కాగా దొంగఓట్లు వేయిస్తున్నారన్న ఆరోపణలతోపాటు కొన్ని ఆధారాలతో సహా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ లేఖ పంపించారు. ఎన్నికల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగఓట్లను అడ్డుకునేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు అంశాలను వివరించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓట్లు వేసేందుకు చిత్తూరు నుంచి AT031359, AP28CC5229 నెంబరు గల బస్సుల్లో తరలించారని , PLR కన్వెన్షన్‌లో బయటి వ్యక్తులకు ఆవాసం కల్పించి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రణాళిక వేశారని, తగిన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బయటి వ్యక్తులతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మాయిపాలెం పరిధిలో టీడీపీ ఏజెంట్లను రానీయకుండా అడ్డుకున్నారని, పోలింగ్ మొదలయ్యాక బయటి వ్యక్తులు వచ్చి బూత్ క్యాప్చర్‌కి పాల్పడ్డారన్నారు. నారాయణవనం మండంలోని భీమునిచెరువు, కసిమెట్ట,తొట్టెంబేడు మండంలంలో కందెంగుంట పరిధిలోనూ ఇదే జరిగిందన్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Must Read ;- పుంగనూరు వీరప్పన్ మంత్రి పెద్దిరెడ్డి.. నారా లోకేష్
బయటి నుంచి వచ్చిన వ్యక్తులను పంపించివేయాలంటూ..
పార్లమెంటు పరిధిలో బయటి నుంచి వచ్చిన వ్యక్తులను పంపించి వేయాలని, హోటళ్లు, లాడ్జిలు, కల్యాణ మండపాలు, గెస్ట్ హౌస్‌లలో తనిఖీలు చేయడంతో పాటు బయటి నుంచి వస్తున్న వాహనాలను మరింత పకడ్బంధీగా తనిఖీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలతో పాటు వీడియో క్లిప్పింగ్‌లను జతచేసినట్టు కూడా చంద్రబాబు తన లేఖలో వివరించారు.
పలుచోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళన..
మరోవైపు ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని, పోలీసుల ఎదురుగా బహిరంగ దౌర్జన్యానికి దిగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పలు చోట్ల ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పూతలపట్టు- నాయుడుపేట రహదారిపై మల్లవరం సెంటర్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ కూడా వైసీసీ దొంగఓట్లు వేయించుకునేందుకు ప్రణాళిక రూపొందించిందని, భారీగా దొంగ ఓట్లు వేయించుకునేందుకు జనాలను తరలిస్తున్నారని విమర్శించారు. ఓవైపు పార్టీల విమర్శలు ప్రతివిమర్శలు చోటుచేసుకుంటుండగా చంద్రబాబు రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- వైసీపీ అరాచక పాలనను అడ్డుకోండి.. ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్