నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. జనవరి 26న రైతులు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. కొందరు రైతులను రెచ్చగొట్టి ఎర్రకోటపై దాడికి పురికొల్పారు. ఎర్రకోటపై సిక్కుల మత జెండాలను ఎగురవేశారు. పోలీసులపై కూడా దాడులు చేయడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. రైతులను ఢిల్లీ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చురుగ్గా చేపట్టినట్టు తెలుస్తోంది.
గాజీపూర్ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల జులుం
గాజీపూర్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న 30 వేల మంది రైతులు అక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ ముందుగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గాజీపూర్ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు వేసుకున్న గుడారాలను గురువారం రాత్రి పోలీసులు బలవంతంగా తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక సింఘు, టిక్రి సరిహద్దుల్లోనూ రైతులు గుడారాలు ఖాళీ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే రైతులు ఉండాలని వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో సింఘు, టిక్రీలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కనీస సదుపాయాలు బంద్
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు మంచినీరు, ఆహారం, కరెంటు సరఫరా చేస్తోన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అలాంటి వారిని పోలీసులు బెదిరిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించే టిఫిన్, భోజనశాలలను పోలీసులు బలవంతంగా మూసివేయించారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గుడారాలు వేసుకున్న ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంటు కట్ చేయడం, నీటి సరఫరా తగ్గించడం, ఇంటర్ నెట్ సేవలు నిలిపివేయడం, వారికి ఆహారం అందకుండా చేసే చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. రైతులు రోడ్లు ఖాళీ చేయాలంటూ స్థానికులను రైతులపైకి ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తోంది. స్థానికులకు, రైతులకు మధ్య గొడవలు సృష్టించి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
Must Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం
కేసులకు భయపడం
జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో చెలరేగిన హింసకు బాధ్యులను చేస్తూ పోలీసులు రైతులపై 200లకు పైగా కేసులు నమోదు చేశారు. బురారీ డీడీఏ మైదానం ఖాళీ చేయాలని 30 మంది రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికేసులు పెట్టినా బెదిరేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్ కుండబద్దలు కొట్టారు. అవసరం అయితే ఆత్మహత్యలైనా చేసుకుంటాం, చట్టాలు రద్దు కాకుంటే వెనుతిరిగేది లేదని స్పష్టం చేశారు. రైతుల శాంతియుత ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించి అల్లర్లు సృష్టించడం ద్వారా పంజాబ్, దేశం నుంచి విడిపోయే కుట్రకు బీజం వేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రైతులపై అక్రమ కేసులను నిరసిస్తూ రాకేష్ టికాయిత్ గురువారం అర్థరాత్రి నుంచి నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో గాజీపూర్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉత్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీక్ష విరమించిన మూడు సంఘాలు
జనవరి 26న చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో రెండు రైతు సంఘాలు నిరసన విరమిస్తున్నట్టు ప్రకటించాయి. కొందరు తమ ఇష్టానుసారం రైతుల దీక్షను హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారని, ఎవరిష్టం వచ్చినట్టు వారు ఉద్యమం చేస్తే, అలాంటి ఉద్యమం నుంచి తాము తప్పుకుంటున్నామని రెండు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి నిరసన దీక్ష విరమిస్తున్నట్టు షియోరాజ్ సింగ్ ప్రకటించారు. దీంతో మొత్తం 41 రైతు సంఘాల్లో మూడు సంఘాలు నిరసన విరమించినట్టయింది.
స్థానికులను రెచ్చగొట్టే ప్రయత్నం
రైతులు గుడారాలు వేసుకున్న ప్రాంతంలో కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా కేంద్ర కొత్త ఎత్తుగడ వేసింది. రైతుల గుడారాలు, నిరసన దీక్షల వల్ల తాము నివశించే ప్రాంతం దరిద్రంగా తయారైందని, రైతులు వెంటనే ఖాళీ చేయాలంటూ స్థానికులు కొత్తరాగం అందుకోవడంలో కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగిఉందని రైతుల సంఘాలు అనుమానిస్తున్నాయి. అందుకే రైతులు గుడారాలు వేసుకున్న ప్రాంతాల్లో రైతులే స్వచ్ఛందంగా శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు పిలిపునిచ్చారు. రైతులు ఎవరూ, స్థానికులతో గొడవ పడవద్దని వారి సహకారం తీసుకోవాలని, తమ కష్టాలను స్థానికులకు వివరించే ప్రయత్నం చేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతులను ఏదో విధంగా ఢిల్లీ నుంచి ఖాళీ చేయించి స్వగ్రామాలకు పంపిస్తే ఇక భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉండవనే నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్రం పావులు కదుపుతోంది. అయితే రైతు సంఘాలు, రైతులు మాత్రం నూతన సాగు చట్టాలు రద్దు చేసిన తరవాతే తమ గ్రామాలకు తిరిగి వెళతామని పట్టుదలతో చెబుతున్నారు. రైతులపై కేంద్ర ఉక్కపాదం మోపాలనే ప్రయత్నాలు వికటించే కొత్త సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read ;- రైతుల దీక్షలో చీలిక: కేంద్రం తలచినదే జరిగినదా?











