ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలు రైతులు ఉల్లంఘించారు. సరిహద్దులు దాటి దేశరాజధాని లోకి ప్రవేశించిన రైతులు కొత్త అల్టిమేటం విధించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు వెనక్కి వెళ్లేది లేదని రైతుల డిమాండ్ చేశారు.
మరోవైపు ఎర్రకోటను చుట్టుముట్టిన రైతులు.. ఎర్రకోటపై రైతుల జెండాను ఎగురవేశారు. జెండాస్తంభం పైకి ఎగబాకిన రైతులు.. అక్కడ తమ జెండాను ఎగరేశారు. ఎర్రకోటపై దాదాపు గంటకుపైగా రైతులు ఉన్నారు. పోలీసులు రెచ్చిపోయి రైతులపై చర్యలకు తెగబడకుండా, సంయమనం పాటించి.. వారిని బుజ్జగించి ఎర్రకోటపైనుంచి కిందికి దింపారు.
రైతులు చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం, శాంతి పాటించాలని…. పోలీసుల పై దాడి , విధ్వంసం సృష్టించవద్దని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లోని ముకర్బా చౌక్ వద్ద రైతుల పై బాష్పవాయువును ఉపయోగించారు. బారికేడ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పాటు ట్రాక్టర్లతో సిమెంటు దిమ్మలను తొలగించే ప్రయత్నం రైతులు చేశారు.
ట్రాక్టర్లతో ఢిల్లీ లోని ఎర్రకోట వద్దకు చేరకుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేశారు.
రాహుల్ విజ్ఞప్తి
రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. హింస ఏ సమస్యకైనా పరిష్కారం కాదుని, ఎవరైనా గాయపడితే, మన దేశానికి నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
Must Read ;- వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం