చాలా చిన్నతనంలో చందమామలో చదివిన ఒక కథ చెప్పాలి.
జపాన్‌లో బుద్ధుడి పట్ల అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. పిల్లల్లో పెద్దల్లో దాదాపుగా అందరిలో బుద్ధుడంటే అపరిమితమైన గౌరవాభిమానాలు ఉంటాయి. అలాంటి చోట ఓ స్కూలుకు తనిఖీ నిమిత్తం ఒక అధికారి వచ్చారు. ఓ చిన్న కుర్రాడితో మాట్లాడాడు. ఆ మాటల్లో బుద్ధుడి పట్ల అపరిమితమైన భక్తి కనిపించింది. ఏ సమస్య గురించి ప్రస్తావించినా బుద్ధుడు చూసుకుంటాడు అన్నట్టుగా జవాబు చెబుతున్నాడు. వారి సంభాషణ ఇలా సాగింది.
‘‘బాబూ.. మీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటావు’’
‘‘రాజుకు చెప్పుకుంటా’’
‘‘రాజు చెడ్డవాడు అయితే, స్వయంగా అతనే మిమ్మల్ని కష్టాలకు గురిచేస్తే ఎవరికి చెప్పుకుంటావు’’
‘‘బుద్ధుడికి చెప్పుకుంటా..’’
‘‘పొరుగుదేశం నుంచి ఇంకొక రాజు వచ్చి మీమీద యుద్ధం చేస్తే ఏం చేస్తావు?’’
‘‘మా రాజు చెడ్డవాడు కావొచ్చు.. కానీ.. అతనితో కలిసి దేశం కోసం యుద్ధం చేస్తా’’
‘‘ఒకవేళ బుద్ధుడే స్వయంగా దండెత్తి వచ్చాడు. బుద్ధుడు గెలిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. అప్పుడేం చేస్తావు’’
‘‘బుద్ధుడు దేవుడు. దేవుడిగా బుద్ధుడిని పూజిస్తా. కానీ దేశం మీదికి దండెత్తి వస్తే మాత్రం. బుద్ధుడైనా సరే ఊరుకునేది లేదు. దేశం కోసం బుద్ధుడి మీదనే యుద్ధం చేస్తా’’
.. ఇదీ కథ! బుద్ధుడు దేవుడు కావొచ్చు. జపనీయులు దేవుడిని అత్యంత ఇష్టంగా ఆరాధించవచ్చు. కానీ దేశం మీదికి వస్తే వాళ్లు బుద్ధుడిని ఖాతరు చేయరు. అంటే దేవుడికంటె కూడా వారికి దేశమే గొప్పది.. అనేది కథలోని నీతి.
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న పనులు చూస్తోంటే ఎందుకో ఈ కథ గుర్తుకొస్తోంది.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి.. ఒకవైపు రైతులు అత్యంత కఠోరమైన, ప్రతికూలమైన పరిస్థితుల్లో మడమ తిప్పకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. ఎండలో చలిలో రోడ్లమీదే పడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మరోవైపున ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురు తేజ్ బహదూర్ ను ఖననం చేసిన గురుద్వారా రకాబ్ గంజ్ కు ఆదివారం నాడు వెళ్లారు. తేజ్ బహదూర్ అంటే… గురునానక్ తర్వాత.. ఎంతో ప్రభావశీలమైన గురువుగా సిక్కులందరూ భావిస్తారు. ఆరాధిస్తారు. అలాంటి తేజ్ బహదూర్ జయంతి ఈనెల 11. ఆ సందర్భంగా అని ముడిపెడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ గురుద్వారా రకాబ్ గంజ్‌కు వెళ్లి.. నివాళులు అర్పించారు. తేజ్ బహదూర్ సేవలను ప్రస్తుతించారు.
నివాళి సరళం.. ప్రచారం ఘనం..
తేజ్ బహదూర్ ను ఖననం చేసిన గురుద్వారా రికాబ్ గంజ్ కు వెళ్లడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అత్యంత సింప్లిసిటీని పాటించారు. ప్రధానిగా ప్రోటోకాల్ హంగామా ఏమాత్రం లేకుండా ఆయన అక్కడకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట ఎవ్వరూ లేరు. కేవలం అది మాత్రమే కాదు.. కనీసం ప్రధాని వాహనం వస్తోంటే.. రోడ్లలో ట్రాఫిక్ ను ఆపడం, మళ్లించడం కూడా జరగలేదు. అంత సింపుల్ గా ఆయన అక్కడకు వెళ్లారు. సాగిలపడి ప్రణామాలు ఆచరించి.. తేజ్ బహదూర్ స్మృతికి నివాళులు అర్పించారు.
ప్రధాని చొరవకు సహజంగానే అద్భుతమైన ప్రచారం లభించింది. మామూలుగానే.. ప్రధాని చేసే ప్రతిపనికీ పుష్కలమైన ప్రచారం లభిస్తుంటుంది. అలాంటిది ఆయన ప్రత్యేకించి.. కనీస సెక్యూరిటీ కూడా లేకుండా గురుద్వారాకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.
Must Read ;- నిజమా? : అంబానీ మనవడిని చూసే టైం మోడీకి ఉందా?
రైతుల ఆందోళనలతో ముడి..
ఢిల్లీ సరిహద్దుల్లో మార్గాలను స్తంభింపజేసి.. భారీ ఆందోళనలు చేస్తున్నవారిలో అత్యధికులు పంజాబ్‌కు చెందిన రైతులే. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవైపు పంజాబ్ రైతులు కేంద్రం ప్రభుత్వం దిగి రావాలంటూ పెద్ద ఎత్తున దీక్షలు చేస్తుండగా.. సిక్కులు ఆరాధించే గురుద్వారాకు ప్రధాని వెళ్లడం విశేషమే. కాకపోతే.. 11వ తేదీన తేజ్ బహదూర్ జయంతి అయితే.. 20వ తేదీన వెళ్లడమే నాటకీయంగా అనిపిస్తుంది. ఇలాంటి చర్యల ద్వారా పంజాబ్ రైతుల్ని మచ్చిక చేసుకోవడానికి ప్రధాని మోడీ ప్రయత్నించారా? అనే చర్చ కూడా సహజంగానే జరుగుతుంది.
జపాన్ కథ గుర్తుకొస్తున్నది అందుకే…
సరిగ్గా ఇప్పుడు ప్రారంభంలో మనం చెప్పుకున్న జపాన్ బాలుడి కథను గుర్తుచేసుకుందాం. చూడబోతే.. అచ్చంగా ఆ కథలోని బాలుడి మాదిరిగానే.. నేడు పంజాబ్ రైతుల పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లు తేజ్ బహదూర్ ను అత్యంత భక్తితో ఆరాధిస్తారు. కానీ, వారు తమ జీవితాలనే బలి తీసుకుంటాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల విషయంలో వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, వారి వేదనను పట్టించుకోకుండా.. కేవలం వారు ఆరాధించే తేజ్ బహదూర్ కు నివాళి అర్పిస్తే వారందరూ మెత్తబడిపోతారా? ఈ ఒక్క పని ద్వారా.. రైతన్నల ఆందోళన ఉపశమించిపోతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రైతన్నలు కూడా అంతే పట్టుగా ఉన్నారు. తమ జీవితాలను బలిపెట్టే నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళుతూ, ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శించినంత మాత్రాన వారు లొంగుతారా? అనేది ప్రశ్న. తాము నమ్ముకున్న వ్యవసాయాన్ని పణంగా పెట్టి దైవాన్ని ఆరాధించినందుకు మోడీ మాటకు జైకొట్టేంత అమాయకంగా వారు వ్యవహరిస్తారని అనుకోలేం.
వెల్లువెత్తుతున్న విమర్శలు
మోడీ చర్య పట్ల విమర్శలు కూడా బాగానే వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ అయితే.. ఓ కార్టూన్ ను షేర్ చేస్తూ.. ట్విటర్ లో మోడీ చర్యను ఎద్దేవా చేశారు. కేవలం ప్రచారకాంక్షతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ప్రఖ్యాత మళయాళీ కార్టూనిస్టు పెన్సిల్ ఆశన్ గీసిన కార్టూన్ ను శశి థరూరల్ తన ట్విటర్ ఖాతాపై షేర్ చేశారు.
పంజాబీయులు ఆరాధించే దేవుళ్ల పట్ల భక్తి ప్రదర్శించడం కాదు.. పంజాబ్ ప్రజల భయాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం, వారి మాటకు విలువ ఇవ్వడం నరేంద్రమోడీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
తేజ్ బహదూర్ పట్ల ఆరెస్సెస్ లో కూడా ఒక గౌరవం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా గురునానక్ తర్వాత.. సిక్కులకు సంబంధించి తేజ్ బహదూర్ అంత ప్రధానమైన గురువుగా.. ఆయన జీవితాన్ని గతంలో ఆరెస్సెస్ బహుళ ప్రచారంలో పెట్టింది. అప్పట్లో ఆరెస్సెస్ ప్రచారక్ గా కూడా మోడీ పనిచేసి ఉండొచ్చు. ఆ రకంగా తేజ్ బహదూర్ పై మోడీజీ ప్రదర్శించిన భక్తి నిజమైనదే కావొచ్చు కూడా! కానీ.. ఒక వైపు పంజాబ్ రైతులను అసలు మనుషులుగానే ఖాతరు చేయకుండా.. తేజ్ బహదూర్ కు నివాళి అర్పిస్తే.. అది జిమ్మిక్కే అని విమర్శలు రావడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి.
Also Read ;- మోడీజీ! తెగేదాకా లాగితే తలనొప్పి తప్పదు!
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ షేర్ చేసిన కార్టూనిస్ట్ ట్వీట్ ఇది :
There is a photography solution to every crisis 🙄,he knows nothing else 🙄
News: Modi makes surprise visit to historic Delhi gurudwara 🤷♂️#standwithfarmers #indianfarmer #farmersprotest #saveindia #standwithindianfarmers #indian #indians #india #modi pic.twitter.com/RiZc5zaH0a— PENCILASHAN (@pencilashan) December 20, 2020