రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ పరాకాష్టకు చేరింది. తాజాగా జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ కు లేఖ రాశారు. ఎన్నికల షెడ్యూల్ ఆయన వల్లే మార్చాల్సి వచ్చిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మండిపడ్డారు. గతంలో తాను నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకావద్దంటూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేయడం వల్లే మొదటి దశ ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ద్వివేది, గిరిజాశంకర్ పై చర్యలకు ఎస్ఈసీ ఆదేశించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారు. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ మరింద ముదిరినట్టయింది.
సజ్జలపై చర్యలకు సిఫార్సు
ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండి ఎన్నికల కమిషనర్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన సజ్జల రామకృష్ణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. గత కొంత కాలంగా సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఎన్నికల కమిషన్ పై రాజకీయ విమర్శలు చేయడం రాజ్యాంగ విరుద్దమని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.
Must Read ;- కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..











