(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సుమారు రెండు మాసాలుగా కొనసాగుతున్న రైతాంగ పోరాటాన్ని దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. రైతుల ఆందోళన విరమింప జేయడంలో విఫలమైన కేంద్రం వెనక్కి తగ్గడానికి అహం అడ్డు రావడంతో.. అడ్డదారిలో ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసి విఫలం అయిందని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కోర్టు ద్వారా అడ్డుకోవాలని..
కేంద్రం దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా కొత్త దారులు వెతుకుతోంది. అనేక దఫాలుగా సాగిన చర్చల్లో ప్రభుత్వం చేయలేని పని సుప్రీంకోర్టు ద్వారా చేయాలని మోడీ ప్రభుత్వం భావించిన పన్నాగాన్ని రైతులు గమనించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో కనీస మద్దతు ధర చట్టం చేయడానికి నిరాకరించిన ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడానికి మాత్రమే సిద్ధపడింది. మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోడానికి బదులుగా అక్కడక్కడా కొన్ని సవరణలు చేస్తామని చెప్పింది. తాత్కాలికంగా ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని హామీ ఇచ్చింది. రైతు సంఘాలు దానికి ఒప్పుకోకపోవడంతో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కమిటీని వేస్తామని, వీరు చెప్పిన ప్రకారం పోదామని ప్రతిపాదించింది. ఇది కూడా రైతులకు అంగీకారం కాకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సిందిగా ఆఖరిసారి జరిగిన చర్చల్లో స్పష్టం చేసింది.
అనంతర పరిణామాల్లో కోర్టు కమిటీని నియమించింది. రెండు నెలల్లో వారిని నివేదిక ఇవ్వమని, అప్పటి దాకా ఈ చట్టం అమలు నిలుపుదల (స్టే) చేస్తున్నామని తీర్పు చెప్పింది. కోర్టు స్టే ఇవ్వడంతో చట్టాలు వెనక్కి తీసుకున్నట్లుగా, ఉద్యమం ముగిసినట్లుగా పలు వర్గాలు, ప్రభుత్వం అంచనా వేశాయి. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీలో మంగళవారం ఉద్రిక్తంగా మారింది. సహనం కోల్పోయిన రైతులు బారికేడ్లను తొలగించి.. అనుమతి కి మించి ర్యాలీని ముందుకు కొనసాగించారు.
Must Read ;- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి
కోర్టు తీర్పు పర్యవసానాల పై చర్చ..
ప్రస్తుతం పోరాటం చేస్తున్న రైతు సంఘాలలో ఏ ఒక్కరూ తమకు ‘న్యాయం’ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించలేదు. పైగా అఫిడవిట్ వేయాల్సిందిగా సుప్రీంకోర్టే రైతు సంఘాలను కోరింది. అందుకూ రైతు సంఘాలు నిరాకరించాయి. తాము నల్ల చట్టాల చట్టబద్ధత గురించి ప్రశ్నించడం లేదని, వాటిని మొత్తంగానే తిరస్కరిస్తున్నామని, అందువల్ల ఈ విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని రైతులు స్పష్టం చేశారు. అయినా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదన మాత్రమే విని ఈ తీర్పు చెప్పింది. కమిటీ సభ్యుల్ని కూడా వారే నిర్ణయించారు. న్యాయం కోసం తీర్పులు చెప్పాల్సిన సుప్రీంకోర్టు ‘మధ్యవర్తిత్వం’ చేస్తోందని కొన్ని వర్గాలు ఆరోపించాయి. కోర్టులో కేసు వేసింది బిజెపి అనుకూల భారతీయ కిసాన్ సంఫ్. రెండో వైపున వున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు పక్షాలు చట్టాలకు అనుకూలం. వారి వాదనల్ని మాత్రమే విని తీర్పు చెప్పడం వెనుక మతలబు ఏమిటో రైతులందరికీ అర్థమైపోయింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వం కోరుకున్న తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని పలువురు ప్రజాసంఘాల నేతలు విమర్శించారు.
తీర్పులో వున్న ప్రధాన అంశాలు రెండు…
మొదటిది-మూడు నల్ల చట్టాల అమలుపై స్టే ఇవ్వడం. స్టే అంటే చట్టాల చెల్లుబాటును ప్రశ్నించడం కాదు. తిరస్కరించడం అంతకన్నా కాదు. అమలును నిలుపుదల చేయడం. ఇప్పటి వరకు ఈ చట్టాలు ఏ రూపంలో అమల్లోకి వచ్చాయి? వీటిని కోర్టు ఎలా ఆపుతుంది? వ్యాపారస్తులు తమ దగ్గర అపరిమితంగా వున్న నిత్యవసర సరుకులు నిల్వలను తగ్గించుకోవాలి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతాయా? అలా అమలు చేస్తే అక్రమ వ్యాపారస్తులపై కేసులు పెట్టాలి. దీనికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్ సంస్థలు రైతులతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. ప్రభుత్వం వాటిని చట్టవిరుద్ధంగా ప్రకటించగలదా? అన్నింటికన్నా ముఖ్యంగా మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు రైతుల నుండి కొనుగోలు చేయాలి. కాని, కేంద్ర ప్రభుత్వ చట్టాల వలన తాము రైతుల నుండి ధాన్యం కొనబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా కొనడానికి ఆసక్తి చూపడం లేదు. మిల్లర్లు, వ్యాపారులు ఇష్టానుసారం బస్తాకి రూ.200/రూ.300 తగ్గించి కొంటున్నారు. వీరిపై చర్య తీసుకోవడమో లేదా మద్దతు ధరకు ప్రభుత్వం కొనడమో చేయాలి. ఈ రెండూ కేంద్రం అమలు చేయాలి. ఎఫ్‌సిఐ ని రంగంలోకి దించి కొనుగోలు చేయించాలి. ఆ పని చేయిస్తుందా? మరొక అంశం మార్కెట్ యార్డులను రద్దు చేయడం. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ సెస్ రద్దు చేసి అంతర్ జిల్లా, రాష్ట్ర లావాదేవీలు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేసింది. మరలా చెక్ పోస్టులు పెట్టి వ్యాపారస్తుల నుండి సెస్ వసూలు చేస్తుందా? దీనికి కేంద్రం అంగీకరిస్తుందా? ఇవేమీ చేయకుండా చట్టాల అమలుపై స్టే విధించామంటే అర్ధం ఏమిటి? ఈ ‘స్టే’ ఎలా అమలు చేయాలో కనీసం ‘పర్యవేక్షణ కమిటీ’ కూడా వేయలేదు. అంటే తీర్పు ఇచ్చిన వారికి దీని అమలుపై చిత్తశుద్ధి వుందా అన్న అనుమానం రాక తప్పదు. చట్టాల అమలు నిలిపివేయడం కన్నా ఆ పేరుతో ఉద్యమాన్ని నీరుకార్చాలన్న లక్ష్యం కనిపిస్తున్నదని మేధావులు పేర్కొంటున్నారు.
Must Read ;- నాకూ సమ్మతం కాదు.. రైతుల పక్షాన ఉంటానన్న భూపీందర్ సింగ్ మాన్
రైతులు ఎందుకు ‘స్టే’ని అంగీకరించడం లేదు?
‘స్టే’ అనేది తాత్కాలిక చర్య. దీన్ని ఎప్పుడైనా ఎత్తేయవచ్చు. రెండు నెలల తర్వాత రైతులు ఉద్యమాన్ని విరమించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయాక ‘స్టే’ ఎత్తివేస్తే తిరిగి చట్టాలు అమల్లోకి వస్తాయి. అప్పుడు చేయగలిగేది ఏమీ ఉండదు. ప్రభుత్వం మాత్రమే సంతోషంగా వుంటుంది. ప్రభుత్వాన్ని సంతోష పెట్టేందుకే ఈ ‘స్టే’ ఉపయోగపడుతుంది. ‘స్టే’ కి బదులుగా చట్టాన్ని ఉపసంహరించుకొని రైతులు కోరిన పంట గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేసి, దానిపై చర్యల కోసం కమిటీని నియమించి వుంటే రైతులంతా సంతోషించి ఉండేవారని రైతులు పేర్కొంటున్నారు. కాని చట్టాలను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధపడలేదు.
నిజానికి ఈ చట్టాలు రాజ్యాంగబద్ధం కాదని వివిధ రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిధులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన బాధ్యత రాజ్యాంగాన్ని పరిరక్షించడం. పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధం కాకపోయినా, రాజ్యాంగ బద్ధంగా ఆమోదించకపోయినా వాటిని కొట్టేయవచ్చు. ఈ బిల్లులను రాజ్యసభలో పెట్టిన తర్వాత ఓటింగు జరపలేదు. రాజ్యాంగం 100వ ఆర్టికల్ ప్రకారం ఓటింగ్‌కు ఒక్కరు డిమాండ్ చేసినా పెట్టి తీరాలి. కాని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేసినా అంగీకరించకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇది అప్రజాస్వామికమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలనలోకే తీసుకోలేదు.
ఇక రెండో అంశం- కమిటీ నియామకం. … ఏ ప్రాతిపదికపై నలుగురిని ఎంపిక చేశారో కోర్టు వివరణ ఇవ్వలేదు. వారంతా ఈ చట్టాలకు అనుకూలం. రైతాంగ ఉద్యమానికే కాదు, డిమాండ్లకు కూడా వ్యతిరేకం. కనీసం ఉద్యమం పట్ల సానుభూతి కూడా లేదు. వ్యవసాయ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను బలపరిచేవారే. అలాంటి వారు రైతులకు ఎలా న్యాయం చేయగలరు. అందులో ఒకరు భూపేందర్ సింగ్ మాన్. భారతీయ కిసాన్ యూనియన్ పేరుతో చెలామణి అవుతున్న నాయకుడు. అతను ఈ ఉద్యమంలో భాగస్వామి కాదు. కాని రైతుల వ్యతిరేకతతో తాను ఈ కమిటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరొకరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి రైతులు చెప్పింది వింటానని ప్రకటించారు. వింటారు సరే ఆఖరికి ఏం సిఫార్సు చేస్తారన్నదే ముఖ్యం. ఈ కమిటీలో వున్న ఆర్థికవేత్త అశోక్ గులాటి మొదటి నుంచి ఈ చట్టాలను బలపరుస్తున్నారు. కోర్టు ఈ కమిటీని చట్టాలకు అనుకూలంగా ఏర్పాటు చేసింది. ఇక న్యాయం లభిస్తుందని రైతులు ఎలా నమ్ముతారు? తమను విశ్వసించమని కోర్టు రైతు సంఘాలను కోరింది. కాని ఆచరణలో వారికి విశ్వాసాన్ని ఇవ్వలేకపోయింది.
Also Read ;- రైతుల పక్షాన నిలుస్తారా.. కమల భజన చేస్తారా?