నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్ష 62 రోజులకు చేరింది. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు 41 రైతు సంఘాలు ఢిల్లీలో చేపట్టిన దీక్ష హింసాత్మకంగా మారింది. రైతులను తప్పుదారి పట్టించి ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా వారిని రెచ్చగొట్టి దీప్ సిద్దూ అనే కళాకారుడు వారిని ఎర్రకోట వైపు మరలించాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీప్ సిద్దూ ఆర్ ఎస్ ఎస్ మనిషని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల నిరశన పరేడ్ లో హింసను బూచిగా చూసి ఉద్యమాన్ని అణచివేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం తెరలేపిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల దీక్షలో సంఘవిద్రోహ శక్తులను ప్రవేశపెట్టారని రైతు సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల దీక్షలో చీలిక
ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు రెండు నెలలకు పైగా తీవ్రమైన చలి, వర్షాలను లెక్కచేయకుండా నిరసన కొనసాగిస్తున్నారు. ఇంత వరకు ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. కానీ జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ రోజున చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్ లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ఈ హింసను కావాలనే కొందరు ప్రోత్సహించారని అందులో దీప్ సిద్దూ ప్రధాన నిందితుడని కేంద్రం అతనిపై నిఘా పెట్టింది. అయితే ఢిల్లీలో హింసకు కారణంగా భావిస్తున్న వారిపై 22 ఎఫ్ ఐ ఆర్ లు తెరిచారు. 37 మందిపై కేసులు పెట్టి, 200 మందిని అరెస్టు చేసినట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ప్రశాంతంగా జరుగుతున్న రైతుల దీక్షను హింసాత్మకంగా మలచి, రైతుల దీక్షను అణచివేసే కుట్రలు సాగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దీప్ సిద్దూ ఆర్ ఎస్ ఎస్ మనిషని ఆయన గుర్తుచేశారు. రైతుల దీక్షలో హింస చోటు చేసుకోవడంతో రెండు రైతు సంఘాలు దీక్షను విరమించాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు దీక్షలు చేసేట్టయితే, మేం అలాంటి వారితో కలసి పనిచేయలేమని రెండు రైతు సంఘాలు దీక్షను విరమించాయి.
Must Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు
కేంద్రం తలచినదే జరిగిందా
రైతు సంఘాల మధ్య విభేదాలు సృష్టించి వారిలో చీలిక తేవడం ద్వారా నిరసన దీక్షను మసకబార్చే విధంగా చేయాలని బీజేపీ పెద్దలు వేసిన వ్యూహం కొంత వరకు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. రైతులు ర్యాలీ చేపడితే లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉంది. వారిని అదుపు చేయడం ఒక్కోసారి కష్టం. కానీ ఢిల్లీలో రైతులు చాలా వరకు శాంతియుతంగానే ర్యాలీ నిర్వహించారు.
కానీ దీప్ సిద్దూ రైతులను రెచ్చగొట్టి, వారిని దారి మళ్లించి ఎర్రకోటపై జెండా ఎగురవేశారని తెలుస్తోంది. అక్కడ జరిగిన హింసకు దీప్ సిద్దూ చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణంగా భావిస్తున్నారు. అమాయక రైతులను రెచ్చగొట్టడంలో దీప్ సిద్దూ అనుకున్నది సాధించినట్టు తెలుస్తోంది. అయితే దీప్ సిద్దూకు రైతు సంఘాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఉద్యమంలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి, ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంటే బలగాలు ఏం చేస్తున్నాయి. కావాలనే వారిని వదిలేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.
రైతుల దీక్షలో హింస జరగాలని కేంద్రం కోరుకుందా? అంటే అవుననే అనుమానించాల్సి వస్తోందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతుల దీక్షలు హింసాత్మకంగా మారాయని వారిని అణచివేయాలని చూస్తే, మరింత తీవ్రంగా ఉద్యమాన్ని తీసుకెళతామని వారు హెచ్చరిస్తున్నారు.
Also Read ;- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి
రైతులు దీక్ష విరమిస్తారా?
నూతన సాగు చట్టాలు రద్దు చేసే వరకు లక్షలాది రైతులు చేస్తున్న దీక్షను విరమించేది లేదని 39 రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. ట్రాక్టర్ల ర్యాలీలో చోటు చేసుకున్న హింసకు రైతులకు సంబంధం లేదని అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి రెండు సంఘాలు రైతుల దీక్ష నుంచి తప్పుకున్నా, తాము మాత్రం అనుకున్నది సాధించుకుని మాత్రమే ఇంటిదారిపడతామని రైతు సంఘాల నాయకులు కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే రెండు నెలలకు పైగా దీక్షలు చేస్తున్నారు.
తినడానికి సరైన తిండి, వసతి లేకపోయినా అర్థాకలితో అయినా దీక్షను కొనసాగించేందుకు రైతులు, రైతు సంఘాలు సిద్దంగా ఉన్నాయి. కేంద్రం దిగిరాకుంటే రైతుల ఉద్యమం ఎంతకాలమైనా కొనసాగే అవకాశం ఉంది. 2 సంవత్సరాల పాటు చట్టాలను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించినా రైతులు దీక్షను విరమించేందుకు ముందుకు రాలేదు. నూతన సాగు చట్టాల రద్దే ప్రధాన అజెండాగా వారు ముందుకు సాగుతున్నారు. చట్టాలు రద్దు అయ్యే వరకు దీక్షలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read ;- వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం