గత నెల 26న ప్రారంభమైన రైతు ఉద్యమం అంతకంతకూ పెరుగుతుందే కానీ ఎక్కడా ఆగడం లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నాడు. అన్నదాత ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో కార్పొరేట్ సంస్థలకు రుచి చూపించాలని నిర్ణయించుకున్నాడు. రైతులు బాగు కోసమే చట్టాలు తెచ్చాం అంటోంది ప్రభుత్వం. అవి మాకు నష్టం తప్ప ఇంకేమీ మిగల్చవని మేమంటుంటే ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికంతటికీ కారణం కార్పొరేట్ కంపెనీలు ఒత్తిడి చేయడం వల్లే అని భావించిన రైతన్నలు తమ పంథా మార్చి కార్పొరేట్ల సంస్థలకు చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారు.
బహిష్కరించండి
అంబానీ, అదానీ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మద్దతు తెలపమని దేశ ప్రజలకు, మిగిలిన కార్మిక, ఉద్యోగ సంఘాలను కోరుతున్నారు. రిలయన్స్ కు చెందిన ఏ ఉత్పత్తులను వాడద్దని, కొనద్దని పిలుపునిచ్చారు. చివరికి జియో సిమ్ లను సైతం వాడకూడదని కఠిన నిర్ణయానికి వచ్చారు. ఈ తీవ్ర నిర్ణయంపై అదానీ గ్రూపు స్పందించింది. రైతుల వద్దనుండి పంట కొనుగోలు చేయడం లేదని ప్రకటన జారీ చేసింది. ఎఫ్ సీఐ గోడౌన్లు, కోల్డ్ స్లోరేజ్ మాత్రమే తాము నిర్వహిస్తున్నామని, పంట విక్రయంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
మీ ప్రతిపాదనలు మాకొద్దు
వ్యవసాయ చట్టాల్లో చేయదల్చుకున్న సవరణలను కేంద్రం రైతు సంఘాలకు పంపించింది. పంటలకు మద్దతు ధర కొనసాగింపుపై హామీ ఇస్తామని, మండీ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఒప్పంద సేద్యంపై నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఇస్తామని, తదితర ఏడు ప్రతిపాదనలను పంపించింది. రైతు చట్టాల రద్దు తప్ప, ఇంకే ప్రతిపాదనలు ఒప్పుకునే ప్రసక్తే లేదని రైతు సంఘాలు ముక్తకంఠంతో తిరస్కరించారు. కేంద్రం ఇంకా పాత వైఖరికే కట్టుబడి ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 14న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిశ్చయించారు. దేశంలోని ప్రతి బీజేపీ ఎమ్మెల్యేను, ఎంపీని ఘోరావ్ చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వంలో కదలిక వస్తుందా
రైతులు 14 రోజులగా గడ్డకట్టిన చలిలో నిర్విరామంగా నిరసన చేస్తున్నా కూడా ప్రభత్వం చట్టాలను కొనసాగించాలని పట్టుబట్టడంలో ఆంతర్యం కార్పొరేట్ సంస్థలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: బీజేపీ నోట.. మధ్యంతర ఎన్నికల మాట:సంచలన వ్యాఖ్యలు!