సైన్యంబు చెదరిన – సైన్యనాథుని తప్పు అని నరసింహ శతక కారుడు చాలా స్పష్టంగానే సెలవిచ్చాడు. సీసంలో ఇలా.. ఎవరెవరు దారితప్పడాన్ని, ఎవరి తప్పుగా పరిగణించాలో చాలా స్పష్టంగా లక్షణీకరిస్తూ.. చివర్న తేటగీతిలో ‘‘ఇట్టి తప్పు లెఱుంగక – యిచ్చ వచ్చినటుల మెలఁగుదు రిప్పుడీ – అవని జనులు’’ అంటూ ముక్తాయించాడు. ఆయన ఏ కాలంలోని అవని జనులను ఉద్దేశించి ఈ పద్యం రాశారో గానీ.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి రాజకీయ పరిస్థితులను గమనించినప్పుడు కూడా నరసింహ శతకంలో ప్రవచించిన నీతికి కాలదోషం పట్టలేదని అనిపిస్తుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు.. పార్టీ పరువును బజారుకీడ్చేలా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఊరూరా ఇలాంటి దృష్టాంతాలు అనేకం మనకు కనిపిస్తాయి. పార్టీ నాయకులు, శ్రేణులు ఇలా అదుపుతప్పి వ్యవహరిస్తోంటే.. అధినేత ఏం చేస్తున్నారు.. ఎందుకంత అచేతనంగా ఉన్నారు? వీరిలా దారితప్పడానికి ఆయన బాధ్యత లేదా? అనేది మనకు ఎదురయ్యే ప్రశ్న.
తాజాగా వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రేవతి వ్యవహారాన్నే తీసుకుందాం. టోల్ గేటు వద్ద.. నలభై నుంచి తొంభై రూపాయలు ఉండగల ఫీజును చెల్లించకుండా వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు. నిబంధనలు అనుమతించవు కాబట్టి.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె కారు దిగి దాదాగిరీకి ప్రయత్నించారు. బారికేడ్‌ను ఈడ్చి పక్కన పడేసేందుకు ప్రయత్నించారు. సిబ్బందిని దూషించారు. ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు. రేవతిపై పోలీసు కేసు కూడా నమోదు అయింది. అంతిమంగా పార్టీ పరువు బజార్న పడిన ఈ సంఘటన పుణ్యమాని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నాడు నిర్వహించదలచుకున్న 56 బీసీ కార్పొరేషన్ల బాధ్యుల పదవీ స్వీకరణ కార్యక్రమం వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్క రేవతి దెబ్బకు ‘బీసీ సంక్రాంతి’ మసకబారింది! ఈ ఒక్క ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని తూకం వేయడం ధర్మం కాదు. కానీ.. ఇటువంటి అనేకానేక సంఘటనలు ఇటీవలి కాలంలో జరిగాయి.
ముఖ్యమంత్రి జగన్ అచేతనంగా ఉన్నారనడం కరెక్టు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా చురుగ్గానే పాల్గొంటున్నారు. సమీక్షలు గట్రా చేస్తున్నారు. అయితే.. ఒకే ఒక్క సందేహం ఏంటంటే.. ఇలా పార్టీ పరువును బజార్న పెడుతున్న వారి విషయంలో ఆయన ఏం పట్టించుకుంటున్నారు.
రేవతి దూకుడుతనం ఒక్కటే కాదు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. దుర్గగుడి సభ్యురాలి కార్లో, స్మగుల్ చేసిన లిక్కర్ సీసాలు దొరికితే ఆమెతో పదవికి రాజీనామా చేయించారు. మరి, ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి పోలీసు అధికారికి ఫోను చేసి నానా చండాలంగా తిట్టిపోస్తే- ఎవరు ఏం పట్టించుకున్నారు. ఆమె అసెంబ్లీకి రాకపోయే సరికి.. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో అసెంబ్లీకి రావొద్దని అధినేతే చెప్పినట్టుగా కొన్ని వార్తలు వినిపించాయి. అయితే.. ఆమె చర్యలతో పోయేదేమైనా ఉంటే అది ఆల్రెడీ పోయింది. కానీ.. మందలించినట్టుగా కూడా రాలేదు.
జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకుంటున్నారు?
జగన్ కేవలం సీఎం మాత్రమే కాదు. పార్టీ అధినేత కూడా. ప్రజలను చక్కగా చూసుకోవడం ఎలా ఆయన బాధ్యత అవుతుందో, పార్టీని కాపాడుకోవడం కూడా ఆయన బాధ్యతే. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ పని చాలా చక్కగా చేస్తున్నారు.
గన్నవరం, మాచర్ల, దర్శి, అద్దంకి.. ఈ తరహాలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య ముఠా తగాదాలు మితి మీరుతున్నాయి. ఈ ముఠా కొట్లాటలు శృతి మించినప్పుడు గన్నవరం విషయంలో మాత్రం జగన్ పట్టించుకున్నారు. గన్నవరం నాయకుల్ని పిలిపించి చేతులు కలిపి రాజీ కుదిర్చారు. మిగిలిన నియోజకవర్గాలలో రచ్చల్ని పార్టీలో కీలక వ్యక్తులకు అప్పగించినట్లుగా.. వారు వార్నింగ్‌లు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు
రెండో తరహా పరువుపోయే వ్యవహారాలు డీడీఆర్సీ సమావేశాల్లో జరిగినవి. విశాఖలో పార్టీ నాయకుల దందాల గురించి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించగానే పెద్ద రాద్ధాంతం అయిపోయింది. అదే సీన్ తూర్పుగోదావరి జిల్లాలో రిపీట్ అయింది. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ వంతు అయింది. ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు మాత్రం జగన్ చాలా వేగంగా రెస్పాండ్ అయ్యారు. తనే స్వయంగా పూనుకుని.. రెండో రోజునే ఆ నాయకుల్ని తన వద్దకు పిలిపించుకుని హితవు చెప్పి క్లాస్ తీసుకుని పంపారు.
ఎలాంటి సంకేతాలు వెళ్తాయి?
ఇక్కడ మూడు రకాల ‘పరువు పోయే’ వ్యవహారాలు మాట్లాడుకున్నాం. (1) ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు చైర్మన్ల ఆగడాలు, అక్రమాల దందాలు (2) నియోజకవర్గాల్లో ముఠాలు నిత్యం తగాదా పడుతుండడం (3) ఏకంగా డీడీఆర్సీల్లో సొంత పార్టీ నాయకులే గొడవ పడి, ఒకరి అవినీతి గురించి ఒకరు బయటపెట్టుకోవడం.
ఈ మూడు కేటగిరీలో పార్టీ అధినేతగా జగన్ ఎలా స్పందిస్తున్నారనేదాన్ని బట్టి.. ప్రజలకు అలాంటి సంకేతాలు వెళతాయి.
(1) దందాలు అరాచకాలు
స్పందన సంకేతాలు : ఏం పర్లేదు. ఎలా వ్యవహరించినా పర్లేదు. ఆ విషయాల్లో జోక్యం చేసుకుని మందలించడం, చర్య తీసుకోవడం అనవసరం. వారు ఆమాత్రం దందా చేసుకోకపోతే ఎలా? ఇక పదవులు, హోదాలు ఉన్నది ఎందుకు?
(2) ముఠా కొట్లాటలు
స్పందన సంకేతాలు : మందలించితే సరిపోతుంది. అందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగక్కర్లేదు. ఇతర నాయకులతో వార్నింగ్ ఇప్పించి జాగ్రత్తగా ఉండమంటే చాలు.
(3) సొంతపార్టీలోనే ఒకరి అవినీతి ఒకరు బయటపెట్టడం
స్పందన సంకేతాలు : ఇది మాత్రం చాలా సీరియస్. తక్షణం తాట వలిచేయాల్సిందే. ఇలాంటివి రిపీట్ కాకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే.
సాధారణంగా ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తోంది. జగన్ దేన్ని గురించి సీరియస్ గా తీసుకుంటున్నారనే విషయంలో ప్రజలు ఏమనుకుంటారు? నాయకుడు ఇలా వ్యవహరిస్తోంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. పార్టీ శ్రేణుల విచ్చలవిడితనాన్ని అధినేత స్వయంగా ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తే పార్టీకి ప్రమాదం. ఏ వ్యవహారంలో తాను ఏ రీతిలో స్పందించడం వల్ల.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో.. జగన్మోహన రెడ్డి ఓ సారి సమీక్షించుకుంటే మంచిది.
ముందే చెప్పుకున్నట్టు.. ‘సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు’ అనే సంగతి గుర్తించి తీరు మార్చుకుంటారో.. ‘ఇట్టి తప్పులెరగ’కుండా.. ఎరిగినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారో చూడాలి.
Also Read: సుప్రీంలో జగన్‌కు కాస్త చేదు.. కాస్త తీపి!
.. సురేష్ పిళ్లె