ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఉండదన్న సామెత మనకు ఉండనే ఉంది. ఈ మాట యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు అక్షరాలా వర్తిస్తుంది. ఏపీ రాజధాని అంశం ఎన్నో వివాదాల్లో ఉంది. దీని మీద ఉద్యమాలు సైతం జరుగుతున్నాయి. పైగా ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఇది తనకు సంబంధించిన అంశం కానప్పటికీ ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ టీవీ షోలో ఆయన వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఈ వ్యాఖ్యలు తీవ్రమైన అంశంగా ఏపీ పరిరక్షణ సమితి పరిగణించింది.
ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇది ఎక్కడిదాకా వెళ్లింది అంటే యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడించేదాకా వెళ్లింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌లో యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. దాంతో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం కల్లా ప్రదీప్ క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అయితే క్షమాపణ చెప్పడానికే ప్రదీప్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ది చెప్పడానికి తాము వెనకాడబోమని శ్రీనివాసరావు అంటున్నారు. ప్రదీప్ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఓ మహిళకు సంబంధించిన అంశంలోనూ ఆరోపణలను ప్రదీప్ ఎదుర్కొన్నారు. సెక్స్ రాకెట్ లో అతని పేరు వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా అతని మీద విపరీతంగా ట్రోల్స్ జరగాయి.
ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. ఇప్పుడు టీవీ షో లో ఈ తాజా వివాదం. ఏపీ రాజధాని ఏది అన్న ప్రశ్నకు అతని సమాధానం వైజాగ్ అని రావడం వివాదానికి కారణమైంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ భగ్గుమంది. ప్రదీప్ ఇంటిని ముట్టడించాలన్న నిర్ణయం వరకూ వ్యవహారం వెళ్లింది. ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Must Read ;- అమరావతిపై ఎందుకు అంత ద్వేషం.. పదివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?