నిజమే… ఏపీలో రెండేళ్ల కిందట కొత్తగా పాలన చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద లెక్కే లేదని చెప్పాలి. సరే… పాలన అంటే జగన్ కు కొత్త కదా. ఒకింత దూకుడు స్వభావం. వెరసి కోర్టుల్లో ప్రతి అంశంలోనూ జగన్ కు మొట్టికాయలే. మరి ఏళ్ల తరబడి పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైంది? ఆయన నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు కూడా కోర్టుల నుంచి శ్రీముఖాలు అందుతున్నాయి. కోర్టు ఆదేశాలంటే అంతగా లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్న కారణంగానే ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నాలుగు శాఖలకు కోర్టు ధిక్కరణ నోటీసులు
ఇందుకు నిదర్శనంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ సర్కారుకు కోర్టు ధిక్కరణ నోటీసులు మంగళవారం జారీ అయ్యాయి. ఇదేదో ఒక్క శాఖకే ఈ నోటీసులు అందాయనుకోవడానికి లేదు. అంశం ఒక్కటే అయినా… తెలంగాణ జెన్ కో తో పాటు తెలంగాణ ట్రాన్స్ కో, ఎస్పీడీఎసీఎల్, కార్పొరేట్ ఆఫీస్ అధికారులకు..మొత్తంగా నాలుగు విభాగాలకు నోటీసులు జారీ అయ్యాయి. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీఎసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి గోపాలరావులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోరా?
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత ధర్మాధికారి నివేదిక ప్రకారం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వమూ తనకు కేటాయించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నా.. 84 మందిని ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారంతా కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. అధికారులకు నోటీసులిచ్చి విచారణను జులై 16కి వాయిదా వేసింది. మరి ఈ నోటీసులకు కేసీఆర్ సర్కారు ఏ రీతిన సమాధానం ఇస్తుందో చూడాలి.
Must Read ;- సుప్రీంలో ’ఇన్‌సైడర్‘.. జగన్ పంతం నెగ్గేనా?