దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ.. ‘పెళ్లిసందడి’ సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నిముందుగా రాఘవేంద్రరావే తెరకెక్కించాలి అనుకున్నప్పటికీ.. ఆతర్వాత దర్శకత్వ బాధ్యతలను తన శిష్యురాలు గౌరీకి అప్పగించి.. ఆయన మాత్రం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు కెమెరా వెనకున్న రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందుకు రాబోతున్నారు. అవును.. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లాన్ జరుగుతుంది. దీనికి తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రాఘవేంద్రరావు సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తుండడం విశేషం. శ్రియ, సమంత పేర్లు వినిపించాయి. త్వరలోనే హీరోయిన్స్ ఎవరనేది ఫైనల్ చేసి ఈ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ‘ఓ బాబూ..’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. దర్శకేంద్రుడు ‘బాబు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నటుడి గా మారి సినిమా చేస్తున్న ఫస్ట్ మూవీకి ‘ఓ బాబూ..’ అనే టైటిల్ పెట్టడం విశేషం. ఇందులో రాఘవేంద్రరావును అందరూ బాబు.. బాబు అని పిలుస్తారట. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ‘పెళ్లిసందడి’ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Must Read ;- రాఘవేంద్రరావు నటించడానికి అప్పుడుగానీ ఒప్పుకోలేదట!











