కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 34 రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు పదో రోజుకు చేరాయి. ముఖ్యంగా మూడు అంశాల్లో రైతులు కేంద్రం నుంచి లిఖత పూర్వకంగా హామీ కోరుతున్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్, మద్దతు ధర, ప్రైవేటు మండీల విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూడో దఫా చర్చలు విఫలం అయితే 8న భారత్ బంద్ చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతు సంఘాలకు ఇప్పటికే ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్టు అసోషియేషన్ మద్దతు ప్రకటించింది.
కాంట్రాక్టు ఫార్మింగ్
నూతన వ్యవసాయ చట్టాల వల్ల కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు ఫార్మింగ్ చేసుకునే వెసులుబాటు దక్కుతుంది. దీని వల్ల రైతులతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వారు ఏ పంటలు పండించాలి? ఎంత ధరకు సరకు అమ్ముకోవాలి అనే విషయంలోనూ ఒప్పందాలు చేసుకుంటారు. ఈ కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులకు మార్కెట్లో ఎక్కువ ధర లభించినా, ముందుగా ఒప్పందం చేసుకున్నారు కాబట్టి సంబంధిత కంపెనీలకే సరుకు అమ్ముకోవాల్సి ఉంటుంది. దీన్ని రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులతో కార్పొరేట్ కంపెనీలు ఐదేళ్ల ధరలను ముందుగా ఒప్పందం చేసుకునే విధానాలను చట్టాల నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
మద్దతు ధర
మన దేశంలో పంటలకు మద్దతు ధర చాలా కీలక వ్యవహారం. దాదాపు 18 పంటలకు ఏటా కేంద్రం మద్ధతు ధర ప్రకటిస్తుంది. ఆ ధరలకు రైతులు పండించిన సరకు కొనుగోలు చేస్తోంది. దీని వల్ల మార్కెట్లో పోటీ ఏర్పడి మద్దతుధర కన్నా రైతుకు కొంత మొత్తం అదనంగా లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మద్దతు ధర కూడా దక్కక ధాన్యం, పత్తి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా కొనుగోళ్లు చేస్తేనే ప్రైవేటు వ్యాపారులు కూడా మంచి ధర ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా వెంటనే దళారులు ధరలను పతనం చేస్తున్నారు. ఇక నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే మద్దతు ధర కూడా దక్కుతుందన్న భరోసా కోల్పోవాల్సి వస్తుంది. దీని వల్ల దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నూతన వ్యవసాయ చట్టాలు వచ్చినా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసేందుకు కేంద్రం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని 34 రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రైవేటు మండీలు
ఇప్పటి వరకూ దేశంలో ప్రైవేటు రంగంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే మార్కెట్లు లేవు. నూతన చట్టాలు వస్తే ప్రైవేటు కంపెనీలు మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడకు సరుకు తీసుకువెళ్లిన రైతులకు, కనీస మద్దతు ధర దక్కుతుందన్న నమ్మకం ఉండదు. కనీస మద్దతు ధర దక్కనప్పుడు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా రైతులకు ప్రైవేటు మండీల్లో దొరకదు. దీంతో మద్దతు ధర దక్కే అవకాశాలను రైతులు కోల్పోతారని రైతు సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రైవేటు మండీలు ఏర్పాటు చేసినా, వాటిల్లో కూడా వ్యవసాయ పంటల మద్దతు ధరలు మాత్రం అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్లపై కేంద్ర మూడోసారి చర్చలు సాగిస్తోంది. చర్చలు ఫలిస్తే ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు వెనుతిరిగే అవకాశం ఉంది. లేదంటే 8వ తేదీన భారత్ బంద్ తప్పేలా కనిపించడం లేదు.
Must Read ;- 1949 తర్వాత ఇప్పుడే.. వణుకుతున్న ఢిల్లీ