తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అంతే చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. టీయూడబ్ల్యూజేకు అనుబంధంగా త్వరలో హైదరాబాద్ లోని బషీర్ బాగ్ కార్యాలయం నుంచి తన కార్యకలాపాలను సాగించనున్న క్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ముఖ్య నాయకులు సోమవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విరాహత్ అలీ మాట్లాడుతూ, సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అంత చరిత్ర ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావం నుంచి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనుబంధంగా పనిచేస్తుందన్నారు. కరోనా కష్టాల్లో ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ చేసిన సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్ కొండేటి, ఇ.జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ, “అసోసియేషన్ కు గత వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. బషీర్ బాగ్ లోని దేశోధ్ధారక భవన్లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్యులు ఏ.ప్రభు, కె.లక్ష్మణ్ రావు, మాడూరి మధు, పి.రాంబాబు, ఆర్.డీ.ఎస్.ప్రకాష్, హేమ సుందర్, మురళీ కృష్ణ, నారాయణ రావు, జిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- ఆ మూడు ఛానళ్లకు లోనికి అనుమతిలేదు