ఏ ప్రాంతంలోనైనా .. ఏ భాషలోనైనా .. ఎవరికైనా సినిమానే ప్రధానమైన వినోద సాధనం. గ్రామీణ స్థాయిలో తోలుబొమ్మలాట నుంచి మొదలైన వినోదం .. నాటకాల వైపు మలుపు తీసుకుని, అక్కడి నుంచి సినిమా వైపుకు పరిగెత్తింది. అందువల్లనే తొలితరం సినిమాల్లో నాటకాలలో అనుభవం కలిగిన ఆరిస్టులే కనిపించేవారు. అయితే నాటకాల్లోని కథలు తెరపైకి రావడం అంత తేలికగా జరగలేదు. దాని వెనుక ఎంతో కృషి .. పట్టుదల .. శ్రమ .. దీక్షా దాగివున్నాయి.
తెరపై సినిమాను ఆవిష్కరించి, ప్రేక్షకుల కళ్లలో ఆనందాన్ని చూడటమే ఆశయంగా పెట్టుకుని కృషి చేసిన ‘దుండిరాజ్ గోవింద్ ఫాల్కే’ భారతదేశంలో తొలి మూకీ సినిమాను ఆవిష్కరించారు … ఆ సినిమా పేరే ‘రాజా హరిశ్చంద్ర’. 1913 మే 3వ తేదీన ఈ సినిమా విడుదలైంది. 1921లో రఘుపతి వెంకయ్య తన కుమారుడైన ఆర్.ఎస్. ప్రకాశ్ దర్శకత్వంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే తెలుగు మూకీ సినిమాను నిర్మించారు. ఆ తరువాత పది సంవత్సరాలకి పైగా జరిగిన కృషి ఫలితంగా తొలి తెలుగు టాకీ చిత్రంగా ‘భక్త ప్రహ్లాద‘ వచ్చింది.
హిందీలో తొలి టాకీగా ‘ఆలం ఆరా’ను నిర్మించిన అర్దేషిర్ ఇరానీ, తెలుగులోను ఒక టాకీని నిర్మించాలనుకున్నారు. అప్పటికే ఆయనకి హెచ్ ఎమ్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉంది. కథ ఎంచుకుని చేసుకోమని చెప్పేసి దర్శకత్వ బాధ్యతలను ఆయన హెచ్ ఎమ్ రెడ్డికి అప్పగించారు. తొలి టాకీగా ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించాలనుకున్న హెచ్ ఎమ్ రెడ్డి, ఆ నాటకాన్ని జనంలోకి తీసుకెళ్లిన ‘సురభి’ నాటక సమాజం వారిని సంప్రదించారు. తమ నాటకానికి మూలం ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు చేసిన రచన అని వారు చెప్పారట. వాళ్ల ద్వారా కథ అంతా తెలుసుకున్న హెచ్ ఎమ్ రెడ్డి, 20 వేల రూపాయల నిర్మాణ వ్యయంతో ‘సురభి’ కళాకారులతోనే ఆ సినిమాను రూపొందించారు.
Must Read ;- తెలుగు సినీ పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చిన 2020
1932 ఫిబ్రవరి 6వ తేదీన ముంబైలోని ‘కృష్ణా థియేటర్’లో ఈ సినిమా విడుదలైంది. అలా తొలి తెలుగు టాకీ ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో తొలి మూకీ సినిమాగా వచ్చిన ‘భీష్మ ప్రతిజ్ఞ’లో తెరపై మనుషులు కదిలినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆశ్చర్యపోయారో, తెలుగులో తొలి టాకీగా ‘భక్త ప్రహ్లాద’ వచ్చినప్పుడు తెరపై మనుషులు మాట్లాడటం .. పాటలు – పద్యాలు పాడటం చూసి అంతకంటే ఎక్కవ ఆశ్చర్యపోయారట. అలా ‘భక్త ప్రహ్లాద’ విశేషమైన ప్రజాదరణ పొందింది. అప్పట్లోనే నాలుగు అణాల టిక్కెట్ ను బ్లాకులో నాలుగు రూపాయలు పెట్టి కొనుక్కుని చూడటం విశేషం.
ఈ సినిమాలో హిరణ్య కశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య .. లీలావతిగా సురభి కమలాబాయి .. ప్రహ్లాదుడిగా కృష్ణారావు నటించారు. అలా తెలుగు సినిమా తెరపై తొలి నటిగా సురభి కమలాబాయి నిలిచారు. ఈ సినిమాలో ప్రహ్లాదుడి సహాధ్యాయుడైన మొద్దబ్బాయి పాత్రలో ఎల్.వి.ప్రసాద్ నటించారు. ఆ తరువాత కాలంలో దర్శక నిర్మాతగా ఆయన సాధించిన విజయాలను గురించి తెలిసిందే. ఈ సినిమా చేసినందుకుగాను సురభి కమలాబాయికి 500 రూపాయల పారితోషికం ఇస్తామని చెప్పిన నిర్మాత, ఆమె నటనలో గొప్పతనాన్ని అభినందించి వెయ్యినూట పదహార్లు ఇచ్చాడట. ఇక ప్రహ్లాదుడి పాత్రను పోషించిన కృష్ణాజీరావుకు 400 రూపాయలను ఇచ్చారట.
‘భక్త ప్రహ్లాద’ సినిమా తరువాత వరుసగా పౌరాణిక చిత్రాలు నిర్మితమవుతూ వచ్చాయి. ఇక సాంఘికాలలో కూడా ‘గృహలక్ష్మీ’ సినిమాతో హెచ్ ఎమ్ రెడ్డి కొత్త ఒరవడికి తెరతీశారు. ఆ తరువాత సామాజిక సమస్యలకు అద్దం పడుతూ ‘మాలపిల్ల’ వంటి కథలు తెరపైకి వచ్చాయి. క్రమక్రమంగా పౌరాణికాలు .. సాంఘికాలు బలపడుతూ, జానపద – చారిత్రకాలను కలుపుకుంటూ తెలుగు కథ పరుగులు తీసింది. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు తెలుగు సినిమా కొత్త రూపు రేఖలను సంతరించుకుంటూ వెళుతోంది. ప్రేక్షకులకు మరింత చేరువవుతూ .. చెంత చేరుతూ .. చేతిలోకే వచ్చేసింది. ఇది నిజంగా ఆనందించదగిన .. గర్వించదగిన పరిణామమనే చెప్పాలి.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- 2021 టాలీవుడ్ డైరీలో కొన్ని పేజీలు











