స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలంటూ నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వ విజ్ణప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. స్థానిక ఎన్నికలు, కరోనా పరిస్థితులు రెండూ ప్రజలకు సంబంధించినవేనని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో కూర్చుని మాట్లాడుకోవాలని, లేదంటే ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషనర్ వద్దకు పంపాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా పరిస్థితులు, ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే విషయం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయలేమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంతవరకు కేంద్రం కరోనా వ్యాక్సిన్ షెడ్యూలు కూడా విడుదల చేయలేదని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది.
ఇప్పట్లో ఈ పంచాయితీ తేలుతుందా?
స్థానిక ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నిమ్మగడ్డ పదవీ విరమణ చేసే వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలే నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. కరోనా బూచిగా చూపి స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని మరోసారి కోర్టు మెట్లెక్కారు. జనవరి, ఫిబ్రవరిలో కరోనా రెండు డోసుల టీకా వేయాల్సి ఉన్నందున వైద్య, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున అవసరం అవుతారని హైకోర్టులో ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఇరు వర్గాల పిటీషన్లు పరిశీలించిన హైకోర్టు స్థానిక ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగబద్ద సంస్థ ఎన్నికల కమిషన్ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకునే వీలులేదు. కాబట్టి మీకేదైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద చెప్పుకోండి. వారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా?
స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. అయితే అక్కడ కూడా హైకోర్టు తీర్పును గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే మరోసారి ఎదురుదెబ్బ తప్పదు. అందుకే హైకోర్టులో ఇలా వాదనలు, ప్రతివాదనలు, కేసు వాయిదాలతో మరో మూడు నెలల కాలం వెళ్లబుచ్చుతారని కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా మరో మూడు నెలలు ఎస్ఈసీకి, ప్రభుత్వానికి మధ్య వార్ ముగిసేలా కనిపించడం లేదు.
Must Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే!