నారా లోకేష్ ప్లానింగ్, సహాయం, కోఆర్డినేషన్‌తో కోవిడ్ నుంచి దిగ్విజయంగా బయట పడిన గ్రామం ఇది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం దిశానిర్దేశంలో కోలుకుని ప్రభుత్వ లెక్కలకు ఎక్కని కరోనా బాధితుల విజయగాథ ఇది. తెలుగుదేశం మద్దతుతో గెలిచిన ఓ సర్పంచ్, ఆమె భర్త పట్టుదలతో కృషి చేసి గ్రామాన్ని కరోనా నుంచి దూరంగా ఉంచారు. కరోనా నుంచి కోలుకున్న ఆ గ్రామస్థులంతా ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి రుణపడి ఉంటామంటున్నారు.
నిత్యం లోకేష్ పర్యవేక్షణ..
అది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రు గ్రామం. కరోనా తొలిదశలో ఒక్క కరోనా కేసూ ఈ ఊరిలో నమోదు కాలేదు. సెకండ్ వేవ్‌లో ఏప్రిల్ 24న తొలి కేసు నమోదైంది. ఆర్ఎంపీ వైద్యంతో కోవిడ్ సోకిన వ్యక్తి మృతి చెందారు. దహన సంస్కారాలకు సైతం కుటుంబసభ్యులు ముందుకు రాలేదు. గ్రామసర్పంచ్ ఉమాదేవి చొరవతో..ఆమె భర్త విశ్వనాధపల్లి శివకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు చేయించారు. అనంతరం గ్రామంలో 25 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఊరంతా ఉలిక్కిపడింది. అయితే ప్రభుత్వం నుంచి పరీక్షలు లేవు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో మరో 40 మంది పరీక్షించుకుంటే 30 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హోం ఐసోలేషన్‌లో ఉండండి అంటూ వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. ఏం మందులు వేసుకోవాలో, ఏం తినాలో, ఆరోగ్య పరిస్థితి తెలియక అంతా గందరగోళంగా మారింది. సర్పంచ్ భర్త శివకుమార్ గ్రామంలో కోవిడ్ తీవ్రతని మే1వ తేదీన నారా లోకేష్ దృష్టికి తీసుకురాగా ఆయన పీహెచ్‌సీ డాక్టర్‌తో మాట్లాడి కోవిడ్ పేషెంట్ల స్థితి తెలుసుకున్నారు. వెంటనే కలెక్టర్‌కి నివేదించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌కి ప్రత్యేకంగా ఫోన్‌చేసి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని వివరించారు. మరోవైపు అదే రోజు నుంచి అమెరికాలో ప్రఖ్యాత వైద్యులు ఈదర లోకేశ్వరరావు, ఆయన బృందంతో వైద్యం ఎలా మొదలు పెట్టాలని చర్చించారు. కోవిడ్ వచ్చిన పేషెంట్లలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ వాడటం రాదు. జూమ్ యాప్ లేదు. వీడియో కాల్ మాట్లాడటం కూడా రాదు. దీనిని అధిగమించేందుకు కోవిడ్ పాజిటివ్ అయి వుండి స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ, కొద్దిగా చొరవ, చదువు వున్న ఓ నలుగురికి జూమ్ యాప్ ఇన్‌స్టాలేషన్, కాల్‌లో ఎలా జాయిన్ అవ్వాలనే వివరాలు చెప్పి..మొత్తం పేషెంట్లందరికీ జూమ్ ఇన్‌స్టాల్ చేశారు. పాజిటివ్ వచ్చి జూమ్ ఇన్‌స్టాలేషన్ చేసిన వారినే ఆరోగ్య వలంటీర్లుగా మార్చారు. వీరి ఆధ్వర్యంలో అందరికీ పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ లెవల్ చూడటం, లక్షణాలు కనుక్కోవడం, థర్మామీటర్‌తో టెంపరేచర్ చెక్ చేయడం అలవాటు చేశారు. మామూలు లక్షణాలున్న వారికి చికిత్స, తీవ్రత ఎక్కువగా ఉన్నవారి చికిత్సలకు అవసరమైన మందులను నారా లోకేష్ సమకూర్చగా, శివకుమార్ పేషెంట్లకు అందజేయించారు. ప్రతీరోజూ ఉదయం 8 గంటల నుంచి కోవిడ్ పేషెంట్లతో డాక్టర్ల జూమ్‌కాల్‌లో నారా లోకేష్ కూడా జాయిన్ అయ్యేవారు. వైద్యులు చెప్పిన సూచనల మేరకు అవసరమైనవన్నీ పేషెంట్లకు సమకూర్చారు.
60 మంది రికవరీ..
ఇది ఒకవైపు నడస్తుండగానే నారా లోకేష్ ఏకే సింఘాల్, కలెక్టర్‌లతో మాట్లాడటం వల్ల గ్రామంలో ప్రభుత్వ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి మందులు ఇచ్చారు. టీడీపీ టెలీ మెడిసిన్, కన్సల్టేషన్‌తో అప్పటికే చాలా మంది రికవరీ అయ్యారు. మిగిలినవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని 15 రోజుల్లో పూర్తిగా కోలుకున్నారు. నారా లోకేష్ పర్యవేక్షణలో శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అమెరికా వైద్య బృందం టెలీకన్సల్టేషన్ ద్వారా 60 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించి వారంతా కోలుకునేలా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఒకే ఒక్క కోవిడ్ పేషెంట్ వివిధ ఆస్పత్రులకు తిరిగి మళ్లీ ఊరికి చేరి..జూమ్ ద్వారా వైద్యసేవలు అందుకున్నా అప్పటికే ఇన్‌ఫెక్షన్ ఎక్కువ అవడంతో మృతి చెందారు. గ్రామంలో కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సర్పంచ్ ఉమాదేవి, శివకుమార్ అమలు చేస్తే..కోవిడ్ నుంచి కోలుకునేందుకు సమస్త సాయం నారా లోకేష్ అందించారు. గొడవర్రులో కోవిడ్ నుంచి కోలుకున్నవారంతా తమ ఆరోగ్యం మెరుగుపడేందుకు కృషి చేసిన నారా లోకేష్‌ని అభినందిస్తున్నారు.సాయం చేయడమే కాదు..రోజూ వైద్యులు, పేషెంట్లతో మాట్లాడి జూమ్ కాల్‌లో ఉంటూ తమని సొంత బంధువులా ఆదుకున్న నారా లోకేష్‌కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంటున్నారు గ్రామస్తులు.
Must Read ;- శభాష్: పరీక్షల వాయిదాపై నారా లోకేష్ పోరాటం నిరుపమానం











