దేశ భద్రతకు తమ ప్రాణాలను అర్పించిన వీర జవానులకు ఆయా రాష్ట్రాలు అప్పటి పరిస్థితుల బట్టి పరిహారం అందిస్తూ సంబంధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంటాయి. వీర జవానుల కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పిస్తుంటాయి. వీర జవానులందరికీ ఒకే విధంగా ఈ పరిహారం అందిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలోనూ పక్షపాతం చూపడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ వాల్‌పై పెట్టారు. దీన్ని బుధవారం ఉదయం 10 గంటలకు 467 మంది లైక్ చేయగా, 180 మంది షేర్ చేశారు. 52 మంది కామెంట్స్ చేశారు. ఆమె వాల్‌పై పెట్టిన అంశం యథాతథంగా..
మరణాన్ని కూడా కులంతో ..
వీర జవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సహాయం అందించడం మన రాష్ట్ర అధికార పార్టీకే చెల్లింది. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన వజ్రపుకొత్తూరు మండలం పలాస నియోజకవర్గానికి చెందిన బొంగు బాబురావు కుటుంబానికి కనీసం ఒక సంతాప సందేశం కూడా పంపలేని ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందివ్వడాన్ని విమర్శించటం లేదు. కానీ బొంగు బాబురావు కుటుంబానికి ఎందుకు సహాయం చేయలేదు. ప్రజలు గమనించటం లేదా, లేక గమనించి కూడా అడిగే ధైర్యం చేయటం లేదా అర్ధం కావటం లేదు. మొదటి సారి మరణాన్ని కూడా కులాలతో చూస్తున్న ప్రభుత్వం వలన రాష్ట్ర పతనమే తప్ప ఇంకొకటి లేదు.
సైనికులకు గౌరవం వందనం
జమ్మూ కాశ్మీర్‌లో వీర మరణం పొందిన సైనికులు కెప్టెన్ అశుతోష్ కుమార్, నాయిక్ ప్రవీణ్ కుమార్, సిపాయి ర్యాడా మహేశ్వర్ మరియు బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుదీప్ సర్కార్‌కు నా గౌరవ వందనం సమర్పించుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
శ్రీకాకుళం వాసులకూ..
ముఖ్యమంత్రి గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి మరణించిన సైనిక కుంటుంబాలకు కూడా ఎక్స్ గ్రేషియో ప్రకటించి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష పెట్టిన ఈ పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరిహారం విషయంలో పక్షపాతం చూపడం, కులంతో ముడి వేయటం సరికాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.











