ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల సేవలు నిలిచిపోనున్నాయి. రేషన్ డోర్ డెలివరీ వాహన డ్రైవర్లకు రూ.21 వేలు జీతం ఇస్తున్నారు. మాకు కేవలం రూ.5 వేలానా అంటూ గుంటూరు జిల్లాలో వాలంటీర్లు రోడ్డెక్కారు. గుంటూరు జిల్లాకు చెందిన వాలంటీర్లందరూ నగరంలోని బీఆర్ స్టేడియం వద్ద సమావేశమై నిరసన తెలిపారు. తమకు నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తూ గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరంలో జీతం పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని వారు ధ్వజమెత్తారు. తమ జీతాలు కనీసం రూ.12000 చేయాలని లేదంటే వచ్చే నెల నుంచి సేవలు నిలిపివేస్తామని వాలంటీర్లు హెచ్చరికలు జారీ చేశారు.
రేషన్ డోర్ డెలివరీతో మాకు సంబంధం లేదు
రేషన్ డోర్ డెలివరీలో వాలంటీర్లు సహకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనం వెంబడి తిరుగుతూ, మూటలు దింపుతూ ఆ పనులు మేం చేయలేమని వాలంటీర్లు చేతులెత్తేశారు. రేషన్ డోర్ డెలివరీకి వాలంటీర్లు దూరంగా జరిగారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీ నిదానంగా సాగుతోంది. వాలంటీర్ల సహకారం లేకుండా రేషన్ డోర్ డెలివరీ కష్టంగా మారింది. లబ్దిదారులను గుర్తించడంలో వాలంటీర్లు కీలకంగా మారడంతో రేషన్ డోర్ డెలివరీ చేయకుండా, కాలనీలో ఒకచోటే వాహనం నిలిపి అందరినీ అక్కడికే రప్పిస్తున్నారు. దీంతో లబ్దిదారులు పనులు మానేసి రోడ్లపై క్యూ లైన్లలో పడిగాపుల పడుతున్నారు.
Also Read:రిజెక్ట్ : రేషన్ కందిపప్పు మాకొద్దు సామీ










