రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయనంటూ బీరాలు పలికిన కేసీఆర్.. ప్రధాని ముందు మోకరిల్లి.. రైతుకు వెన్నుపోటు పొడిచారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని, రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, వెల్దండ, కోట్రాగేట్, వంగూరు, డిండిలో కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఏడు గంటల పాటు ర్యాలీ సాగుతూ సాయంత్రం 4.30గంటలకు అచ్చంపేటకు చేరుకుంది.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసి రైతుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని, వ్యవసాయాన్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అచ్చంపేటకు వచ్చే మార్గంలో రైతులు, ఆడబిడ్డలు, యువకులు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, నిరుద్యోగ యువత గుండెచప్పుడు వింటూ వచ్చానని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందని బీరాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తి సీఎం పదవికి పనికిరాడన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బతకాలంటే రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కాగా, రైతు దీక్షలో చేసిన తీర్మానం మేరకు అదే వేదిక నుంచి రేవంత్‌రెడ్డి ఆకస్మిక పాదయాత్ర ప్రారంభించారు.

మొదటి రోజు పాదయాత్ర అనంతరం రోడ్డు పక్క ఏర్పాటు చేసిన టెంట్ లో నిద్రకు ఉపక్రమించారు ఎంపీ రేవంత్ రెడ్డి. తొలిరోజు అచ్చంపేట నుండి ఉప్పునుంతల వరుకు మొత్తం 11కి.మిలు నడిచి తొలిరోజు ఉప్పునుంతలలో విశ్రాంతి తీసుకోన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి తొలిరోజు పాదయాత్ర లో భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు,రైతులు మరియు ప్రజలు.
Also Read: రేవంత్ స్కెచ్‌కు.. కల్వకుంట్ల కవిత వర్గంలో హ్యాపీ











