కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో ఇన్ఫెక్షన్ కేసులు తక్కువ అనే అంశంపై చాలా సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, దీనికి కారణాలు ఏమిటనే విషయంపై వైద్య నిపుణులు కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. “ఐదేళ్ల నుంచి టీనేజ్ మధ్య వయసు ఉన్న వారిలో వైరస్‌ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. వాళ్లకి ఇన్ఫెక్షన్ సోకినా కూడా వాటి లక్షణాలు నిర్ధారణ పరీక్షల్లో బయటపడే స్థాయిలో ఉండవు” అని చెప్తున్నారు డాక్టర్లు. అయినా కూడా కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
కనీస జాగ్రత్తులు తప్పనిసరి
మాస్క్ ఎలా పెట్టుకోవాలో, ఎందుకు పెట్టుకోవాలో పెద్దవాళ్లకు తెలుస్తుంది కానీ… పిల్లలకు తెలియదు. కానీ వాళ్లు కూడా మాస్క్ పెట్టుకునేలా పెద్దవాళ్లమైన మనమే ఒకటికి నాలుగుసార్లు చెప్పి అలవాటు చెయ్యాలి. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత కూడా నేర్పించాలి. అసలే ఇప్పుడు కరోనా వస్తే బయట ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏవీ సరిగా లేవు. అన్నీ కొరతే. చివరకు అంబులెన్సులు కూడా కొరతగానే ఉన్నాయి. కాబట్టి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
రోగ నిరోధకశక్తి కోసం
సిట్రస్ జాతికి చెందిన పండ్లను అంటే బత్తాయి, నారింజ పండ్లను పిల్లలకు తరచూ తినిపించడం ద్వారా ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జలుబు దగ్గు వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది. పిల్లలకు ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినిపించడం ద్వారా వారి శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. పిల్లలకు విటమిన్ ఏ, జింక్ సమృద్ధిగా లభించాలంటే క్యారెట్ తినిపించడం ఎంతో మంచిది. క్యారెట్ జ్యూస్, క్యారెట్ హల్వా ఇలా ఏదో ఒక రూపంలో తినిపించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లకు దారి తీయదు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండడం వల్ల ఎటువంటి కంటి సమస్యలు లేకుండా కంటి చూపు మెరుగు గా ఉంటుంది. చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది.
Also Read:డబుల్ మాస్క్‌తో కరోనాకు చెక్











