తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు!
తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి! కేసీఆర్ ప్రభుత్వంపై తరుచు పొలిటికల్ దాడులకు పాల్పడుతూ.. ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి విపక్షాలు! కాంగ్రెస్, బీజేపీ ముప్పెట దాడిచేస్తుంటే.. షర్మిల మరోవైపు శూలాలతో గుచ్చిగుచ్చి వేదిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య అభిప్రాయ బేధాలు ఇరువురి మధ్య చిచ్చును రాజేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బెంగాల్ లో అనుసరించిన రాజకీయాలు వ్యూహాలను బీజేపీ అనుసరిస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. సీఎం మమత, బెంగాల్ గవర్నర్ జవగదీప్ ధాంకర్ మధ్య తలెత్తిన విబేధాలు చిలికిచిలికి గాలివానాలా మారాయి. చివరికి సొంత ఎజెండాలతో ఎవరి దారి వారిదే అన్నట్లు పాలనను సాగిస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో విబేధాలు తెలంగాణలో రిపీట్ అవుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఆధ్వర్యంలో సాగే కార్యక్రమాలకు కేసీఆర్ వెళ్లకపోవడం, మంత్రుల్లో ఎవరూ హాజరుకాకపోవడం.. అటు గవర్నర్ కూడా తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి లెక్కలపై ఏమీ మాట్లాడకపోవడం వంటివి చూస్తే.. గవర్నర్ కు, సీఎంలకు మధ్య గ్యాప్ ఓ రేంజ్ లో ఉందన్నది బహిర్గతమౌతున్న వాస్తవం!
మారుతున్న పరిణామాలు.. రాజుకుంటున్న వివాదాలు!
ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడి జరిగింది. ఈ ఘటనపై గవర్నర్ తమిళి సై అర్వింద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసు కమిషనర్ నాగరాజు పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని గవర్నర్ కు ఆయన తెలిపారు. అంతేకాక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ కు అర్వింద్ వివరించారు. ఇదిలా ఉంటే దీనిపై ఒకటి రెండు రోజుల్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై జరుగుతున్న వరస దాడులను ఢిల్లీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంటుంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు ఫుల్ యాక్టీవ్ అయ్యాయి. అన్ని జిల్లాల్లో కాషాయ శ్రేణులు ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అర్వింద్ పై జరిగిన దాడిని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుని బీజేపీ శ్రేణులు తెలంగాణలో పట్టుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ కి మధ్య రాజుకున్న రాజకీయ వివాదం ఆసక్తికరంగా మారింది!
Must Read:-రాజ్యాంగం వర్సెస్ ప్రజాస్వామ్యం! కేసీఆర్, తమిళిసై మధ్య విబేధాలకు కారణాలివేనా!!