తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే చాలు ‘మనం సైతం’ అంటూ ముందుంటున్నారు నటుడు కాదంబరి కిరణ్ కుమార్. ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్ కుమార్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఆపన్నులకు అండగా ఉంటున్నారు. తాజాగా ఓ డబ్బింగ్ కళాకారిణిని ఆయన ఆదుకున్నారు. ఆరాధన పెండెం అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి ‘మనం సైతం’ దృష్టికి వెళ్లింది.

వెంటనే ఆ సంస్థ తరఫున రూ. 25 వేలను ఆరాధన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాటుచేశారు. తమను కష్టకాలంలో ఇలా ఆదుకున్నందుకు ఆరాధన కుటుంబ సభ్యులు కాదంబరి కిరణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అపర దానకర్ణుడు సోనూ సూద్ మాదిరిగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేకపోయినా ఎందరినో తనకు తోచిన రీతిలో ఆదుకునే ప్రయత్నాన్ని కాదంబరి కిరణ్ చేయడం ఎంతైనా అభినందనీయం.
అసలు దానం చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. తను కోట్లకు కోట్లు సంపాదించలేకపోయినా ‘మనం సైతం’ అనే ఫౌండేషన్ స్థాపించి సినిమా రంగంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిస్సహాయులను, పేదలను ఆదుకునేందుకు ఒక జీవనదిలా మనం సైతం ఉంటుందని ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ వివరించారు.











