సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా .. త్వరలో హైద్రాబాద్ లో తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టనుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా.. బ్యాకింగ్ రంగంలోని అక్రమాల్ని, అవినీతిని ప్రధానంగా ఫోకస్ చేయబోతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇంత వరకూ ‘సర్కారువారి పాట’ సినిమాలో.. మహేశ్ బాబు తో ఢీకొట్టే విలన్ అన్వేషణలో ఉన్నాడు దర్శకుడు. ముందుగా అనిల్ కపూర్ అన్నారు, ఆ తర్వాత వివేక్ ఓబెరాయ్ , ఉపేంద్ర , అరవింద స్వామి, అర్జున్ పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా తమిళ నటుడు మాధవన్ ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో నిజా నిజాలేంటో తెలియదు కానీ.. మహేశ్ అభిమానులు మాత్రం మాధవన్ విషయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ను గుర్తు చేసుకుంటున్నారు.
అదేంటంటే.. మాధవన్ తెలుగులో ఇంతవరకూ విలన్ గా నటించిన సినిమాలు హిట్టవ్వలేదు. ముందుగా నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీలో కూడా మాధవన్ విలన్ గా కనిపిస్తాడు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. అందుకే మాధవన్ విలన్ అనేసరికి ఆందోళన చెందుతున్నారు.
అయితే ‘సర్కారు వారి పాట’ సినిమా కథాంశం మాత్రం చాలా థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. దర్శకుడు పరశురామ్ మొదటి చిత్రం ‘యువత’ .. మంచి థ్రిల్లర్ మూవీ. ఏటీయమ్స్ లో దొంగనోట్లు పెట్టే ముఠా చుట్టూ అల్లుకున్న ఈ సినిమా కథ .. భలేగా థ్రిల్ చేస్తుంది. సరిగ్గా ‘సర్కారు వారి పాట’ లో అలాంటి వ్యవహారమే హైలైట్ కాబోతోందని సమాచారం. మరి ఇందులో మాధవన్ విలనిజం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Also Read:మహేశ్ బాబు సరసన జాన్వీకపూర్.. నిజమేనా?