స్థానిక ఎన్నికల విషయంలో రేగిన గొడవ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ ను విచారిస్తూ.. హైకోర్టు మధ్యంతరంగా ఒక సూచన చేసింది.
ముగ్గురు ప్రభుత్వాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఎన్నికల సంఘంతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయికి తగ్గని ముగ్గురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు కావాలి. ఆ సంగతి ఎన్నికల సంఘానికి తెలియజేస్తే.. ఎప్పుడు సమావేశం అయ్యేదీ ఈసీ నిర్ణయిస్తారు. ఆ సమయానికి వారు భేటీ అయి.. ఎందువల్ల ఎన్నికలు నిర్వహించలేమని అనుకుంటున్నారో.. ఏ కారణాల చేత హైకోర్టును ఆశ్రయించారో.. అవే కారణాలను ఈసీకి వివరించాలి అని న్యాయమూర్తి సూచించారు. ఇరుపక్షాల మద్య సంప్రదింపులు జరగాలన్నారు.
ప్రభుత్వానికే ఎడ్వాంటేజీ
హైకోర్టు సూచనతో రాష్ట్రప్రభుత్వానికి ఎడ్వాంటేజీ లభించినట్లయింది. సంప్రదింపులు అనే మాట వలన.. అడుగు ముందుకు పడకుండా చేయడం లేదా, అడుగు ముందుకు పడడానికి జాప్యం జరగడం ఉంటుంది. హైకోర్టు సూచన మేరకు అధికార్ల కమిటీ ఈసీతో సంప్రదింపులు జరపడం.. ఆ సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం, తిరిగి వాటిని ప్రభుత్వానికి నివేదించడం.. అవసరమైతే మళ్లీ సంప్రదింపులు జరగడం .. ఈ క్రమం ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రక్రియ వల్ల జాగు తప్ప మరోటి జరక్కపోవచ్చు.
ఒకవైపు ఈసీ తరఫు న్యాయవాది ప్రభుత్వం చెబుతున్న వాదనలోనే నిజం లేదని అంటున్నారు. వాక్సిన్ వేయడానికి సంబంధించి ఇప్పటిదాకా కేంద్రం షెడ్యూలు చెప్పలేదు గనుక.. ఎన్నికలు పెట్టేయాల్సిందే అంటున్నారు. అయితే ప్రభుత్వం వాక్సిన్ రాబోతున్న తరుణంలో.. కొన్నాళ్లు ఆగడానికి బదులు ఎన్నికలు నిర్వహించడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అని వాదిస్తోంది. ఇవే విషయాలను నేరుగా ఈసీకే చెప్పాలన్నది హైకోర్టు సూచన.
ఈసీతో ఇప్పటికే పలు కోణాల్లో ప్రభుత్వంతో ప్రతిష్టంభన నెలకొని ఉంది. సంప్రదింపులు- అనేవి కోర్టు ఆదేశాల మేరకు టెక్నికల్ గా జరగవచ్చు గానీ.. సమస్యను పరిష్కారం దిశగా నడిపిస్తాయని.. ఈసీ ఆశిస్తున్నట్లుగా ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టేయడానికి ఈ చర్య వల్ల వీలు కుదురుతుందని అనుకోడానికి వీల్లేదు.
Must Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే!