ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరుణ్ కుమార్ గోస్వామి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. గోస్వామి ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసినట్టు కొలీజియం నుంచి వస్తున్న సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ ఏడున ఏపీ హైకోర్టు సీజేగా జేకే మహేశ్వరి పదవీ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 14 నెలల కాలంలో అనేక కీలక కేసుల్లో సీజే తీర్పులు వెలువరించారు. నిన్న సమావేశమైన ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణ హైకోర్టు సీజే రాఘవేంధ్ర సింగ్ చౌహాన్, మరికొందరు సీజేల బదిలీలు ఖరారైనట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
Must Read ;- నారాయణ వ్యాఖ్యలు నిజమేనా.. బదిలీలు జరగనున్నాయా ?











