ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపకుండా నిలిపి వేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై ప్రస్తుతం స్టే ఇవ్వడం కూడా సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వ వాదన ఇలా..
ఏపీలో ఇప్పటికే 9 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారని, 7 వేల మంది చనిపోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంకా ఏపీలో ప్రతి రోజూ 600 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, 15 వేల యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే 50 మంది పోలీసులు కూడా కరోనా బారినపడి చనిపోయారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా నిలుపుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయలేమని తేల్చి చెప్పింది. దీనిపై స్టే ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.
ఎస్ఈసీ న్యాయవాది ఏమన్నారంటే..
ఏపీలో గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎన్నికల ప్రక్రియ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం జోస్యం చేసుకోవడం తగదని, కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ ఉటంకించారు. రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల కమిషన్ విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను అశ్వనీ కుమార్ చదివి వినిపించారు. హైదరాబాద్‌తో పాటు గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తయ్యాయని ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్థాన్‌లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని, దేశ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు పూర్తి చేశారని ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఈసీ సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోనూ సంప్రదించిన మీదటే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిందని న్యాయవాది అశ్వనీకుమార్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
Must Read ;- మా రాష్ట్రం మా పంచాయితీ మా ఇష్టం